- -9 శాతం నుంచి 3 శాతానికి..
- -స్థిరాస్తిరంగానికి సర్కారు ఊతం
- -రాజధానిలో ఎక్కడైనా బహుళ అంతస్తులకు అనుమతి
- -మల్టిఫ్లెక్స్‌ల ఎత్తుపై పరిమితి ఎత్తివేత
- -మూసీ బఫర్‌జోన్ 50 మీటర్లకు కుదింపు
హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారానికి మంచిరోజులు.. రియల్ ఎస్టేట్‌ను ఉరకలెత్తించే దిశగా తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అనేక ఏండ్లుగా రియల్ వ్యాపారులు కోరుతున్న పలు మినహాయింపులు, ప్రోత్సాహకాలకు పచ్చజెండా ఊపింది. ప్రధానంగా రియల్ వ్యాపారం కోసం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు చెల్లించే వినియోగ మార్పిడి (నాలా) చార్జీలను భారీగా తగ్గించింది. ఇప్పటివరకు 9 శాతం వసూలు చేస్తున్న చార్జీలను 3 శాతానికి తగ్గించింది. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 5శాతం చార్జీలను 2 శాతానికి తగ్గించింది. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భారీగా లబ్ధి చేకూరనుంది.
రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారాన్ని ఉరకలెత్తించాలనే లక్ష్యంతో మంత్రివర్గం మొత్తం 21 అంశాలను ఆమోదించింది. నగరంలో ఎక్కడైనా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకునే అవకాశం కల్పించటం ఇందులో కీలకమైంది. గతంలో ఈ పరిమితి వల్ల రియల్ వ్యాపారులు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంపాక్ట్ ఫీజు స్లాబులను రెండుకు కుదించి నామమాత్రపు చార్జీలను నిర్ణయించింది. మరోవైపు మల్టిఫ్లెక్స్ భవనాల ఎత్తు 30 మీటర్లు మించరాదన్న నిబంధన ఎత్తివేసింది.
భవన నిర్మాణ అనుమతి తీసుకున్న తరువాత భవనాలు నిర్మించేందుకు గరిష్ట గడువును ఐదేండ్లనుంచి ఆరేండ్లకు పెంచింది. ఈ ఆరేండ్ల వ్యవధిలో ప్లాట్లు ఖాళీగా ఉన్నా కూడా వెకెంట్ ఫీజులు వసూలు చేసే పద్ధతిని ఎత్తివేసింది. ఇక మూసీకి ఇరువైపులా ఉండే గ్రీన్ బెల్ట్‌ను 50 మీటర్లకు పరిమితం చేస్తూ మరో ప్రధాన నిర్ణయాన్ని మంత్రిమండలి తీసుకుంది. సిటీ వెలుపల ఉన్న 100 మీటర్ల గ్రీన్‌బెల్ట్‌ను కుదించింది. మంత్రి మండలి నిర్ణయాలపై రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
జెట్ వేగంతో స్థిరాస్తి వ్యాపారం
నాలుగేండ్లుగా స్థిరాస్తి రంగంలో అభివృద్ధి కుంటుపడింది. దీనిని అధిగమించి పెద్ద ఎత్తున నిర్మాణ రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ నిర్ణయాలతో హైదరాబాద్ అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏడాది కాలంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం మెరుగుపడింది. ఇపుడు సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది.
- సీహెచ్ రామచంద్రారెడ్డి . ప్రధాన కార్యదర్శి, తెలంగాణ క్రెడాయ్



No comments:
Post a Comment