కేజ్రీవాల్‌పై పోటీకి బీజేపీలో చేరిన కిరణ్, షాజియా ఇల్మీ
మరో ఇద్దరు ‘ఆప్’ నేతలకూ కమలం తీర్థం
మాజీ ఐపీఎస్‌కు పార్టీ ప్రచార బాధ్యతలు
న్యూఢిల్లీ, జనవరి 16: ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీలోకి కీలక నాయకుల చేరికతో ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. అన్నా హజారే ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేదీ బీజేపీలో గురువారం చేరగా, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు షాజియా ఇల్మీ, షకీల్ అంజుమ్ దెహ్లావీ, ఫర్హానా అంజుమ్‌లు శుక్రవారం చేరారు. శాసనసభ ఎన్నికలలో పార్టీ టికెట్ ఇస్తే ‘ఆప్’ అధిపతి అరవింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేయడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నాననీ కిరణ్ బేదీ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ‘‘ఎవరెక్కడ పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. కేజ్రీవాల్‌పై పోటీ చేయవలసిందిగా పార్టీ నన్ను ఆదేశిస్తే తప్పకుండా బరిలోకి దిగుతా. నన్ను గెలిపించడానికే ఎన్నికల రంగంలోకి దింపుతారుగానీ ఓడించడానికి కాదుగదా.... ఈ విషయం నాకన్నా పార్టీకి బాగా తెలుసు’’ అని బేదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తిదాయక నాయకత్వంతో ఇప్పటిదాకా రాజకీయాలంటే తనకున్న విముఖత పోయిందనీ కిరణ్ బేదీ వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా ఉంటానని ప్రకటించుకునే బేదీ బీజేపీలో చేరడం తమకు దిగ్ర్భాంతి కలిగించిందంటూ ‘ఆప్’ నేతలు గురువారం విమర్శించారు.
ముల్లును ముల్లుతోనే తీయాలన్న వ్యూహాన్ని బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికలలో అమల్లో పెడుతోంది. రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలలో మంచి ఇమేజ్ ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కిరణ్ బేదీకి ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా నగర ఓటర్లను తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో బీజేపీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. బేదీని బీజేపీలో చేర్చుకునే కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు కావడం విశేషం. అంతకముందు బేదీ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై కీలక చర్చలు జరిపారు కూడా. పార్టీ ఎన్నికల ప్రచారానికి బేదీ నాయకత్వం వహించనున్నట్లు ఇప్పటికే స్పష్టం కావడంతో రాజధాని అంతటా ఆమె పోస్టర్లు అంటించి, నిలువెత్తు కటౌట్లను ఏర్పాటు చేసేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఈసారి మళ్లీ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆసక్తి లేదనీ షాజియా ఇల్మీ తెలిపారు. అయితే పార్టీ ఆదేశాలకు తాను కట్టుబడి ఉంటానన్నారు.
కేజ్రీవాల్‌కు ఉపాధ్యాయ్ లీగల్ నోటీసు
విద్యుత్ పంపిణీ కంపెనీ బీఎస్‌ఈఎస్‌తో తాను కుమ్మక్కయినట్టుగా ఆరోపించిన అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ శుక్రవారం లీగల్ నోటీసు జారీ చేశారు.


No comments:
Post a Comment