నవీపేటలో రెండు గంటల పాటు బైఠాయింపు
పోలీసు జీపు అడ్డగింత... తోపులాట
వృద్ధురాలికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
నవీపేట/భిక్కనూరు/జక్రాన్‌పల్లి, జనవరి 16 : అర్హులైన తమకు ఆహార భద్రత బియ్యం ఇవ్వలేదని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బాధితులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. నవీపేటలో పెద్దఎత్తున గుమిగూడిన జనం సుమారు రెండు గంటల పాటు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇటీవల అధికారులు ప్రకటించిన ఆహార భద్రతకార్డుల జాబితాలో తమ కుటుంబాల పేర్లు ఎందుకు చేర్చలేదని ఈ సందర్భంగా ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను పక్కకు తప్పించే ప్రయత్నం చేయగా... ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనలో పాల్గొన్న నవీపేట ఉప సర్పంచ్ తెడ్డు పోశెట్టిని పోలీసులు జీపు ఎక్కించగా, స్థానిక మహిళలు వాహనాన్ని అడ్డుకుని జీపు పైకెక్కి కూర్చున్నారు. దీంతో పోలీసులు తెడ్డు పోశెట్టిని విడిచిపెట్టారు. ఇదే సమయంలో ఆందోళన చేస్తున్న వృద్ధురాలు గంధం గంగుబాయి అస్వస్థతకు గురై, సృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను స్థానికులు వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఫ్యూటీ తహసీల్దార్ సుభాష్‌చందర్‌లు రాస్తారోకో ప్రదేశానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. అర్హులందరికీ బియ్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే జిల్లాలోని జక్రాన్‌పల్లి, భిక్కనూరు ప్రాంతాల్లోనూ ఆహార భద్రత కార్డులు ఇవ్వాలంటూ పలువురు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


No comments:
Post a Comment