ఈ నగరాన్ని ఇలాగే వదిలేస్తే భవిష్యత్ మరింత ఘోరంగా తయారవుతుంది. కాబట్టి ఇపుడు పూర్తిస్థాయిలో హైదరాబాద్‌ను ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్‌కు పట్టిన జబ్బు వదలాలంటే మామూలు వైద్యం సరిపోదు. శస్త్రచికిత్స చేయాలి. నగరంలోని ప్రజలు కనీస అవసరాలుకూడా తీర్చుకోలేని విధంగా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటుండటం చాలా దారుణమైన విషయం.
- హైదరాబాద్ నగర సమీక్షలో సీఎం కేసీఆర్
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నడుం బిగించారు. ఈ వేసవిలోనే సాగర్‌ను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం తగిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సాగర్‌ను కలుషితం చేస్తున్న మురుగునీటి నాలాలను మళ్లించే పనుల్లో వేగం పెంచాలని చెప్పిన సీఎం ఇందుకోసం తగినన్ని నిధులు మంజూరు చేశామని వారికి గుర్తు చేశారు.
-సుందర నగరం కోసం సీఎం సంకల్పం
-వేసవి దాటేలోపు హుస్సేన్‌సాగర్ శుద్ధి
-మురుగునీటి నాలాల మళ్లింపు
-ప్రజావసరాల కోసం ప్రభుత్వ భూములు
-పార్కింగులు, టాయిలెట్లు, ధోబీఘాట్లు
-రెండుచోట్ల పేదల కోసం టవర్లు
-పచ్చదనం కోసం చెట్ల పెంపకం
-హైదరాబాద్ అభివృద్ధి సమీక్షలో సీఎం
సాగర్‌ను ప్రక్షాళన చేయడంతోపాటు దాని పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం (ఎఫ్‌టీఎల్)కూడా కచ్చితంగా నిర్ధారించాలని కేసీఆర్ ఆదేశించారు. శనివారం సచివాలయంలో హైదరాబాద్ నగరాభివృద్ధిపై సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హెచ్‌ఎండీఏ చైర్‌పర్సన్ ప్రదీప్‌చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేశ్‌రంజన్, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ బీఎల్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు సీఎం నగరంలోని మోండా మార్కెట్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా చూశారు. వ్యాపారులు, వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో జరిగిన సమావేశంలో నగరంలో నెలకొన్న వివిధ సమస్యల మీద చర్చించారు. నగరంలో నెలకొన్న పరిస్థితిపై సీఎం ఈ సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి ఎంతో అందాన్నిచ్చే హుస్సేన్‌సాగర్ వంటి సరస్సు మురికినీటి కూపంగా మారింది.. అటవీ భూములు ఉన్నాయి కానీ అందులో చెట్లే లేవు. మురికి కాల్వల పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది.
రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. నిత్యం ట్రాఫిక్ జాంలు తప్పడం లేదు. ధోబీఘాట్లుకూడా చాలినన్ని లేవు. కూరగాయల మార్కెట్లుకూడా సరిగా లేవు, వర్షపు నీరు పంపేందుకు కాల్వలు కూడా లేవు అని నగర పరిస్థితిని ముఖ్యమంత్రి ఆవేదనతో విశ్లేషించారు. ఈ పరిస్థితి మారాలి.. వీటన్నింటి రూపురేఖలు మారాలి.. ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపడాలి అని సీఎం చెప్పారు. ఇందుకోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో చిత్తశుద్ధితో పనిచేసి ఫలితాలు సాధించాలని సీఎం కోరారు.
ఈసందర్భంగా హుస్సేన్‌సాగర్ శుద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడారు. వేసవిలో హుస్సేన్‌సాగర్‌ను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలని ఆదేశించారు. నగర పరిధిలో ఉన్న అన్ని అటవీశాఖ భూములను గుర్తించి వాటిలో చెట్లు విరివిగా పెంచాలని సూచించారు. వనస్థలిపురం జింకల పార్కును బాగా అభివృద్ధి చేయాలని, స్థానికులతో కమిటీ వేసి పార్కును రక్షించాలని ఆదేశించారు. నగరంలో ఎన్ని రైతు బజార్లు అవసరం అవుతాయో అంచనా వేసి, వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు.
అంబేద్కర్‌నగర్, వెంగళ్రావు నగర్‌లలో ప్రజలు ఇరుకు గదుల్లో, మురికి కూపాల్లో జీవనం సాగిస్తున్నారని, అక్కడ వెంటనే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. అవసరాన్ని బట్టి రెండు, మూడు అంతస్తుల భవనాలు నిర్మించి కనీసం 500 కుటుంబాలు నివసించేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. నగరంలో ఏయే ప్రభుత్వ శాఖల పరిధిలో ఎంత భూమి ఉందో గుర్తించాలని, ఖాళీగా ఉన్న స్థలాల్లో దోభీఘాట్లు, శ్మశానవాటికలు, కూరగాయలు, మాంసం మార్కెట్లు, టాయిలెట్లు, ఫుట్‌పాత్‌లు, పార్కింగు ప్లేస్‌లు నిర్మించాలని సూచించారు. వారసత్వ కట్టడాల విషయంలో ఆచరణాత్మక పద్ధతి అవలంభించాలని మార్గదర్శనం చేశారు. భవిష్యత్తులో ప్రజా రవాణా వ్యవస్థ బాగా విస్తరించి ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం ఉన్నందున నగరంలో ఎక్కడెక్కడ బస్‌స్టాపులు నిర్మించాలో గుర్తించి స్థలాలను ఎంపిక చేసి పెట్టుకోవాలని సీఎం సూచించారు


No comments:
Post a Comment