రవీంద్రభారతి, మార్చి 21: ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రవీంద్రభారతి ఘంటసాల ప్రాంగణంలో ప్రపంచ కవితా దినోత్సవం జరిగింది. కవి సమ్మేళనంలో 70మంది కవులు పాల్గొన్నారు. ‘‘కోకిల కనబడటం లేదు...’’ అనే శీర్షికన హిమజ చదివిన కవిత ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమ్మా... నాన్నా... అంటూ షాజహాన్ గానం చేసిన కవితకూడా ఆకట్టుకుంది. వడ్డేపల్లి కృష్ణ తన కవిత్వంలో హైదరాబాద్ అభివృద్ధిపై పచ్చదనం పరిశుభ్రత అంటూ మొదలుపెట్టి మురుగు కంపును ఎవరూ పట్టించుకోవడంలేదు అని కవితా గానంలో అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కవులు లేరని కొంతమంది వ్యాఖ్యానించారని, అది నిజం కాదని చెప్పడానికి ఈ రోజు 70మంది కవులు కవిసమ్మేళనంలో పాల్గొన్నారని తెలిపారు. సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కవి సమ్మేళనం నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా, శ్రీ మన్మదనామ సంవత్సరపు ఉగాది వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం రవీంద్రభారతిలో అట్టహాసంగా అందమైన సెట్టింగులతో, పూలమొక్కల గుభాళింపులతో ఉగాది వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి భద్రతాదళం ఆర్భాటాలతో ప్రేక్షకులనుగానీ, పత్రికా విలేకరులనుకానీ పట్టించుకున్న నాథుడే లేరు. ఎండాకాలం మొదలై గొంతెండిపోతున్నా తాగడానికి మంచినీరు కరువైనాయి. ఉగాది ఉత్సవాలను సంబందించి గతంలో మూడు రోజుల ముందుగా విలేకరుల సమావేశంలో చర్చించేవారు. కానీ ఈ సంవత్సరం ఆహ్వాన పత్రాలు స్వయంగా ఇవ్వటానికికూడా ఎవ్వరికీ తీరిక లేదేమోనన్నట్టు విలేకరుల గదిలో పడేసి వెళ్ళారు. ఆహ్వానపత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల గురించి వివరాలు లేవు. అడిగినా చెప్పేవారు లేరు. ఈ విషయమై సాంస్కృతిక సంచాలకులు అడిగి తెలుసుకోవడానికి ఆయన కనబడకపోగా ఫోనుకూడా లిఫ్ట్ చేయలేదు. కార్యక్రమాల వివరాల గురించి సాంస్కృతిక శాఖలో అడిగినా ఫలితం దక్కలేదు.
తెలంగాణ ప్రభుత్వ ఉగాది పురస్కారాలు ప్రదానం
మన్మథనామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినాన శనివారం ఉదయం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పలువురు కళాకారులు, కవులను సత్కరించారు. ముదిగంటి సుజాతరెడ్డి, మలయశ్రీ, గోరటి వెంకన్న (సాహిత్యం), రామలక్ష్మి రంగాచారి, రాజగోపాలాచారి (సంగీతం), సుధీర్‌రావు, రత్నశ్రీ (నృత్యం), బి.అమరేందర్ (నాటకం), సూర్య ప్రకాశ్, అంజనీరెడ్డి (చిత్రకళ), శ్రీనివాస్‌రెడ్డి, పాండు (శిల్పకళ), పేరిణి రమేష్ (పేరిణి నృత్యం), వడ్డేపల్లి శ్రీనివాస్ (జానపద సంగీతం), దర్శనం మొగులయ్య (పనె్నండు మెట్ల కినె్నర - జానపదకళా రూప ప్రదర్శన) పద్మాలయాచార్య (హరికథ), బి.సరోజిని (బుర్రకథ), ఒగ్గు ధర్మయ్య (ఒగ్గు కథ), ఆర్.సదాశివ్ (మిమిక్రీ), చిందు పెదబాబయ్య (చిందు యక్షగానం), నాగబాల సురేష్ (టివి రంగం), యన్.శంకర్, భూపాలరెడ్డి (సినిమా రంగం), నకాష్ వైకుంఠం, చేర్యాల (జానపద చిత్రకళ), నల్ల విజయ్, హుజురమ్మ (హస్తకళ), రవీంద్ర శర్మ (కళా శ్రమం), యం.వి. నర్సింహా రెడ్డి (వేద పరిశోధన) (ఇతరములు). పురస్కార గ్రహీతలకు రూ.10,116/- నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖమంత్రి బండారు దత్తాత్రేయ, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంఎల్‌ఏ రసమయి బాలకిషన్ తదితరుల పాల్గొన్నారు.
గానసభలో..
కాచిగూడ: మన్మథనామ సంవత్సరం ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది వేడుకలు శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మన్మథనామ సంవత్సర ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి పుష్పగిరి పీఠం అభినవోద్దండ శ్రీవిద్యా నృసింహభారతీ స్వామిజీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి స్వామి అనుగ్రహభాషణ చేస్తు ఉగాది ప్రతి ఒక్కరికి సుఖశాంతులను కలుగచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడు డా.కెవి.రమణచారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు డా.కళావెంకటదీక్షితులు పాల్గొన్నారు.
కవులు డా.పోతుకూచి సాంబశివరావు, కెవి.కృష్ణమూర్తి, ముదిగొండ శివప్రసాద్, ముక్తేవి భారతి, జె.బాపురెడ్డి, గంటికోట సోమయాజులు, మంగళగిరి ప్రమీలాదేవి, చిమ్మపూడి శ్రీరామమూర్తి, మనస చెన్నప్ప, ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మీ కవి సమ్మేళనం నిర్వహించారు. సభకు ముందు యం.ఎస్.ఎస్ శ్రీనివాస్ శ్రీమన్మథనామ సంవత్సర పంచాగం శ్రవణం నిర్వహించారు


No comments:
Post a Comment