ఖాట్మండు, మే 12: గత నెల భయోత్పాతం తీరకముందే నేపాల్ మరోసారి భయకంపితమైంది. 8వేల మందిని బలిగొన్న ఏప్రిల్ 25నాటి భూకంపం నుంచి తేరుకోకముందే మరో భూకంపం తాకిడికి నేపాల్ వణికిపోయంది. రిక్టర్ స్కేలుపై 7.3 పాయింట్ల తీవ్రతతో పెను భూకంపం, అనంతరం భారీ తీవ్రతతో అయిదు ప్రకంపనలు సంభవించడంతో కనీసం 42 మంది మృతి చెందగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఖాట్మండుకు ఈశాన్యంగా మారుమూల పర్వత ప్రాంత జిల్లాలను కుదిపేసిన తాజా భూకంపంలో 42 మంది మృతి చెందగా మరో 1117 మంది గాయపడినట్లు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 12.35 గంటలకు ఖాట్మండుకు 83 కిలోమీటర్లు తూర్పుగా ఎవరెస్టు పర్వతానికి సమీపంలో భూమి అడుగున 15 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు అమెరికా భూభౌతిక సర్వే కేంద్రం (యుఎస్‌జిఎస్) తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.4 పాయింట్లుగా మొదట పేర్కొన్న ఈ కేంద్రం ఆ తర్వాత దాన్ని 7.3 పాయింట్లకు సవరించింది. గత నెల వచ్చిన తీవ్ర భూకంపం తాకిడికి బాగా దెబ్బతిన్న దోలాఖా, సింధుపాల్ చాక్ జిల్లాల్లోనే తాజా భూకంపం ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దోలాఖా జిల్లాల్లో ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి కనీసం 18 మంది చనిపోయినట్లు పోలీసులు చెప్పారు.
తొలి భూకంపం సంభవించిన అరగంటకు రిక్టర్ స్కేలుపై 6.3 పాయింట్ల తీవ్రతతో మరోసారి భూమి కంపించడంతో ఖాట్మండులో ఇళ్లలో ఉంటున్న జనం భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. రెండో ప్రకంపన వచ్చిన తర్వాత రిక్టర్ స్కేలుపై 5 పాయింట్లకన్నా ఎక్కువ తీవ్రతతో మరో అయిదు ప్రకంపనలు వచ్చాయని అమెరికా భూభౌతిక సర్వే తెలిపింది. ఖాట్మండులో అరడజనుకు పైగా భవనాలు కుప్పకూలినట్లు పోలీసులు తెలిపారు.
తాజా భూకంపం గత నెల 25న రిక్టర్ స్కేలుపై 7.9 పాయింట్ల తీవ్రతతో సంభవించిన పెను భూకంపం తాకిడికి నిలువ నీడను సైతం కోల్పోయి ఆరుబయటే రోజులు గడిపేస్తున్న వేలాది బాధితులను మరింత భీతావహానికి గురి చేసింది. గత నెల సంభవించిన పెను భూకంపం తాకిడికి 8 వేల మందికి పైగా చనిపోగా వేలాది భవనాలు నేలమట్టం కావడమే కాక వందలాది గ్రామాలు తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. అందుబాటులో ఉన్న మొత్తం హెలికాప్టర్లను వైద్య బృందాలు, ప్రత్యేక సహాయ, పునరావాస దళాలను త్వరలోనే దోలాక, సింధుపాల్‌చాక్ జిల్లాల్లో మోహరించనున్నట్లు నేపాల్ జాతీయ ఎమర్జెన్సీ సెంటర్ తెలియజేసింది. భారత వైమానిక దళం నేపాల్‌లో ఎనిమిది హెలికాప్టర్లను ఉంచగా, అందులో ఒకటి ఈ రోజు భూకంపం వచ్చిన తర్వాత ఏరియల్ సర్వే కూడా నిర్వహించింది.
భూకంపం తర్వాత నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కొద్దిసేపు మూసేసి ఖాట్మండుకు వచ్చే విమానాలన్నిటినీ వేరే ప్రాంతాలకు మళ్లించారు. రెండు వారాల పాటు అన్ని పాఠశాలలను మూసేయాలని అధికారులు ఆదేశించారు. ఖాట్మండులో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనం భయంతో ఇళ్లలోంచి బైటికి పరుగులు తీసారు. కొంతమంది అయితే భయంతో గట్టిగా ఏడుస్తూ కేకలు పెట్టడం కనిపించింది. తమ ఇళ్లకు తిరిగి వెళ్లవద్దని, ఆరుబయలు ప్రదేశాల్లోనే ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేసారు. గత నెల 25న సంభవించిన పెను భూకంపం తర్వాత ఇప్పటివరకు 80కి పైగా ప్రకంపనలు వచ్చిన నేపాల్‌లో తాజా భూకంపం తాకిడికి పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డమే కాక పలు భవనాలు కుప్పకూలిపోయాయి. గత నెల సంభవించిన భూకంపంలో గాయపడిన వందలాది మంది చికిత్స పొందుతున్న ఖాట్మండులోని ప్రధాన ఆస్పత్రిలో మళ్లీ గాయాలు కాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్త చర్యగా వారిని వీల్ చైర్లలో బైటికి తీసుకు వచ్చారు.


No comments:
Post a Comment