న్యూఢిల్లీ, మే 12: తాను అవినీతికి పాల్పడినట్లు రుజువైతే మంత్రి పదవితోపాటు పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సవాల్ చేశారు. కాగ్ నివేదికను బూచిగా చూపించి తన రాజీనామాకు పట్టుబడుతూ కాంగ్రెస్ సభ్యులు మూడు రోజులుగా సభను స్తంభింపచేయటంలో అర్థం లేదని ఆయన మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. గడ్కరీ రాజీనామా చేసి తీరాలన్న డిమాండ్‌తో సభను స్తంభింపచేస్తున్న కాంగ్రెస్ సభ్యులు పట్టును మరింత బిగించారు. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఏ కార్యక్రమాన్ని చేపట్టే వీలులేకుండా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. రెండు గంటలకు సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ అజాద్ మాట్లాడుతూ కాగ్ నివేదికపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. చర్చకు వీలులేని పక్షంలో గడ్కరీ తన వివరణను మరోసారి ఇస్తే తమ అనుమానాలను నివృతి చేసుకుంటామని ఆయన చెప్పారు. మంత్రి గడ్కరీ ఇప్పటికే ఒకసారి సభలోప్రకటన చేసినందున రెండవసారి ప్రకటనకు నిబంధనలు అంగీకరించవని డిప్యూటీ చైర్మన్ కురియన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ సభ్యుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ ప్రకటన చేయటానికి గడ్కరీని అనుమతించారు. గడ్కరీ వివరణపై పాలక ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. చెరకు పిప్పినుంచి కరెంటును ఉత్పత్తిచేస్తామన్న అంగీకారంతో తమ సంస్థ రుణం తీసుకుందని ఆయన అంగీకరించారు. అయితే చెరకు పిప్పి లభించకపోవటంతో సంబంధిత సంస్థల అనుమతితో బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి పొందినట్లు ఆయన చెప్పారు. తాము తీసుకున్న 42కోట్ల రూపాయల రుణం 82కోట్లకు చేరుకోవటంతో నష్టాలను దృష్టిలో పెట్టుకుని వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కోరామని ఆయన వివరించారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద 72కోట్ల రూపాయలను చెల్లించామని ఆయన చెప్పారు. ఈ లావాదేవీలు జరిగినప్పుడు తాను బిజెపి అధ్యక్షునిగా లేదా ఇతర ఉన్నత పదవుల్లో లేనని చెప్పారు. అయితే కాగ్ నివేదికను ఆయుధంగా చేసుకుని తనపై బురద జల్లటానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాగ్ నివేదికలో తన పేరు ఏక్కడా లేదని ఆయన చెప్పారు. అయితే కాంగ్రెస్ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ ఈ వాదన నిజం కాదని రుజువుచేస్తూ కాగ్ నివేదికలో గడ్కరీతోసహా మరి కొంతమంది పేర్లను ప్రమోటర్లుగా పేర్కొందని తెలిపారు. చెరకు పిప్పినుంచి కరెంటు ఉత్పత్తి చేస్తామని చెప్పి తీసుకున్న రుణాన్ని మరో పథకానికి తరలించటం ఎంతవరకూ సబబు? ఈ మళ్లింపువల్ల పెట్టుబడి దారులకు ఆదాయపరంగానూ ప్రజలకు కరెంటు విషయంలో ఎదురైన నష్టానికి పరిహారం ఏమిటి? అన్న ప్రతిపక్షాల ప్రశ్నకు గడ్కరీ వౌనమే సమాధానంగా మిగిలింది. చెరకుపిప్పి లేనందున బొగ్గుతో కరెంటు ఉత్పత్తిని చేపట్టామని చెప్పిన గడ్కరీ, అదే సమయంలో విదర్భలో రెండు చక్కెర కర్మాగారాలలో పిప్పితో కరెంటును ఉత్పత్తి చేయటానికి ఎలా సిద్ధపడ్డారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అంతేకాక గడ్కరీ మరో 16 కంపెనీలను ఈ చక్కెర కర్మాగారానికి అనుబంధ సంస్థలుగా ప్రకటించారు. ఈ 16 కంపెనీలు నామమాత్రంగానే ఉన్నాయని ప్రతిపక్ష సభ్యులు తెలిపారు. గడ్కరీ సమాధానం తమకు సంతృప్తి కలిగించలేదంటూ ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ అజాద్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు.


No comments:
Post a Comment