హైదరాబాద్, మే 12: తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు శుభం కార్డు పడనుంది. కార్మికుల ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బుధవారం ఆర్టీసీ కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా సమావేశం కానున్నారు. ఈ మేరకు బుధవారం రెండు గంటలకు చర్చలకు రావాల్సిందిగా కార్మిక సంఘాలకు పిలుపు అందింది. కార్మిక సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ఫిట్‌మెంట్‌పై ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటనతో తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు బుధవారం తెరపడనుంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంతో పోటీపడి ఫిట్‌మెంట్ ఇచ్చే పరిస్థితి తమకు లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఫిట్‌మెంట్ విషయంలో ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందానికి వచ్చిన పక్షంలో వెంటనే తెలంగాణలోని పది జిల్లాల్లోనూ సమ్మె విరమణ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదరని పక్షంలో ఆ రాష్ట్రంలో సమ్మె కొనసాగుతుంది.
ఉదయం నుంచే హడావుడి
ఆర్టీసీ కార్మికుల ఫిట్‌మెంట్, సమ్మె విరమణపై మంగళవారం ఉదయం నుంచే సచివాలయంలో హడావుడి నడిచింది. ఆర్టీసీ సాధక బాధకాలపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నివేదిక అందించింది. అందులో ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. నివేదికలో ప్రధానంగా డీజిల్ మీద వ్యాట్ తగ్గిస్తే రూ. 250 కోట్లు, ఆర్టీసీ అప్పులపై వడ్డీమాఫీ ద్వారా రూ. 150 కోట్లు, వాహన పన్ను మాఫీతో రూ. 250 కోట్లు, ఇలా మొత్తంగా ఆర్టీసీ సొంతంగా రూ. 650 కోట్లు సమకూరే అవకాశం ఉందని పేర్కొంది. దాంతోపాటు ఫిట్‌మెంట్‌కు సంబంధించి ఆర్టీసీ అధికారులతో చర్చించిన ఉపసంఘం నివేదికలో 35 శాతం, 40 శాతం ప్రతిపాదించింది. అలాగే 43 శాతం ఫిట్‌మెంట్‌కు కూడా ఉపసంఘం వేరుగా మరో ప్రతిపాదనను అందించింది. 43 శాతం ఫిట్‌మెంట్‌తో రూ. 828 కోట్లు అదనపు భారం పడుతుందని నివేదించింది. ఈ నివేదికపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఉపసంఘం సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు.
మీ బలం, బలహీనతలేంటి?
మంత్రివర్గ ఉపసంఘంతో చర్చల అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ రాత్రి 8 గంటలకు ఆర్టీసీ అధికారులను చర్చలకు పిలిపించారు. తెలంగాణ జెఎండి రమణరావు ముఖ్యమంత్రి చాంబర్‌కు వెళ్లారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రమణరావుతో కెసిఆర్ గంటన్నరపాటు చర్చించారు. ఈ సందర్భంగా ‘మీ (ఆర్టీసీ) బలాలు ఏంటి? బలహీనతలు ఏంటీ? ఏ సర్వీసులు ఎలా పనిచేస్తున్నాయి?’ అని వాకబు చేశారు. సంస్థకు ఆపరేషన్ నష్టాలు లేవంటూనే పల్లెవెలుగు బస్సుల ద్వారా ఎక్కువగా నష్టం వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘ఏ బస్సు చూసినా నిండుగా ఉంటది. ఊగులాడుకుంటూ ప్రయాణిస్తుంటరు. ఇంకా నష్టాలు నష్టాలు అని చెబుతున్నరు. నష్టాలు ఎలా వస్తున్నయ్?’ అని అధికారులను ప్రశ్నించారు. ‘ఇప్పుడు అడిగనంతా ఫిట్‌మెంట్ ఇస్తే.. భవిష్యత్తులో మీరు మళ్లీ సాయం కోసం ప్రభుత్వం వద్దకు రారని నమ్మకం ఏముంది? అసలు ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకురావడానికి మీ దగ్గరున్న యాక్షన్ ప్లాన్ ఏంటీ?’ అని నిలదీశారు. తమ దగ్గరున్న భవిష్యత్తు ప్రణాళికలను జెఎండి రమణరావు ముఖ్యమంత్రికి విపులంగా వివరించారు.
నేడు కార్మిక సంఘాలకు ఆహ్వానం
అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం మధ్యాహ్నం కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించారు. ఉపసంఘం సూచనలు, అధికారులతో జరిగిన చర్చల సారాంశాన్ని బట్టి సంస్థను కాపాడుకునేందుకు కార్మిక సంఘాలు చేసే కృషిపై ఆయన చర్చించే అవకాశాలున్నాయి. సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే అధికారుల మార్గదర్శకాలు, కార్మికులు కృషిపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి ఇదే విషయంపై కార్మిక సంఘాలతో కూడా చర్చించనున్నారు. చర్చల అనంతరం కార్మికులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిట్‌మెంట్‌పై స్వయంగా ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఉపసంఘం ప్రతిపాదించిన 40 శాతానికి మరో మూడు శాతం కలిపి 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించనున్నారు.


No comments:
Post a Comment