పోలీసు ఠాణాలలో క్షేత్ర స్థాయిలో నెలకొన్న నిర్లక్ష్యానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు సబ్ డివిజన్ అధికారి చేపడుతున్న కొన్ని ప్రత్యేక చర్యలు సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులలో ధడ పుట్టిస్తోంది. ఉన్నత స్థాయి అధికారి ఎప్పటి కప్పుడు సంబంధిత సెక్షన్‌కు చెందిన కానిస్టేబుళ్లతో మాట్లాడుతూ వారికి అప్పగించిన పనుల పురోగతి గురించి అడిగి తెసుకోవడం డిపార్ట్‌మెంట్‌లో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటి వరకు కానిస్టేబుళ్లతో ఎస్సైలు కూడా సమీక్షలు నిర్వహించలేక పోయారు. దీనిని ఆసరాగా చేసుకుని అనేక ఠాణాలలో క్రిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. దీనికి తోడు అధికారులు కూడా వారిలో సమన్వయాన్ని కుదర్చక పోవడం వల్ల అనేక ఠాణాలలో కేసులు పెండింగ్‌లో పేరుకుపోతూ వచ్చాయి. కానీ నేడు రైటర్లు, సెక్షన్ ఇన్‌చార్జీలు, కోర్టు కానిస్టేబుళ్లు, డయల్ 100 ఇన్‌చార్జీలతో సబ్ డివిజన్ స్థాయి సమీక్షలు మొదలు కావడంతో పోలీసు శాఖలోనే అలజడి మొదలయ్యింది. ఇప్పటి వరకు ఈ సబ్ డివిజన్‌కు వచ్చిన అధికారులంతా కేవలం సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో మాత్రమే సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. కానీ ప్రస్తుత డిఎస్పీ రాంకుమార్ విభాగాల వారీగా సమీక్షా సమావేశాలకు శ్రీకారం చుట్టారు. కేవలం నెల రోజుల కాలంలోనే పలు రకాల సమావేశాలు నిర్వహించి 350 పెండింగ్ కేసులను ఛేదించేలా చర్యలు చేపట్టారు. మొదటగా సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌లతో సమావేశాలు నిర్వహించి కేసుల ఛేదించాలని ఆదేశాలు జారీ చేశారు. సబ్ డివిజన్‌లోని అనేక ఠాణాలలో రైటర్లు, కోర్టు కానిస్టేబుళ్ల పనితీరుపై విమర్శలు ఉండటాన్ని గమనించి వారితో ప్రత్యేకంగా మాట్లాడి ఆదేశాలు జారీ చేసేందుకు గత వారం రోజుల క్రితం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతేకాకుండా గత వారం రోజుల క్రితం ఇచ్చిన ఆదేశాలతో ఎంత మంది రైటర్లు ఎంత వరకు పురోగతి సాధించారో తెలుసుకునేందుకు ఈ సెట్ కాన్ఫరెన్స్‌లు ఇక నుండి ప్రతివారం నిర్వహించేలా చర్యలు చేపట్టారు. దాంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే రైటర్ల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా డయల్ 100కు సంబంధించిన ఇన్‌చార్జీలతో సబ్ డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించి మరో ప్రత్యేకతకు తెరదించారు. ఇప్పటి వరకు ఈ ఇన్‌చార్జ్‌ల గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారు. అంతేకాకుండా ఠాణాల వారీగా డయల్ 100 కాల్స్‌ను ఆయా పిఎస్‌ల ఎస్సైలు తమకేమి పట్టనట్లు వ్యవహరించారు. పై నుండి కాల్ వచ్చిందని తెలిస్తే సెక్షన్ హెడ్ కానిస్టేబుల్ ఆ కాల్‌ను రిసీవ్ చేసుకునే వారు. కానీ నేడు ప్రతి కాల్‌ను కూడా సంబంధిత ఠాణాల అధికారులు పట్టించుకునే విధంగా సబ్ డివిజనల్ అధికారి చర్యలు చేపట్టడంతో ఈ కాల్స్ విషయంలో కూడా ఎస్సైలు నిర్లక్ష్యాన్ని వీడే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉండగా సదరు అధికారి ఠాణాల వారీగా క్రిందిస్థాయి సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేయడం, సెక్షన్‌ల వారీగా సమీక్షలు నిర్వహిస్తుండటంతో కొన్ని ఠాణాల అధికారులు హైరానా పడుతున్నారు. మున్ముందు కూడా ఇదే విధమైన పద్ధతి కొనసాగితే తమ బాగోతాలు ఎక్కడ బయట పడతాయోనన్న భయం వారిని నీడలా వెంటాడుతోంది. క్షేత్ర స్థాయిలో సిబ్బంది అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక ఠాణాలలో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అంతేకాకుండా ఓ ఠాణాలో కోర్టు కానిస్టేబుళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ కానిస్టేబుళ్లు ఏకంగా తమకు సహాయం చేసేందుకు ఉన్నటువంటి జూనియర్ కానిస్టేబుళ్లను బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని పరిగణనలోనికి తీసుకునే సబ్ డివిజన్ అధికారి క్షేత్ర స్థాయి దిద్దుబాటుపై దృష్టి సారించినట్లు తెలిసింది. క్రిందిస్థాయి వారి పనితీరుపై ప్రత్యేక దృష్టి సారిస్తే వారు తమ నిర్లక్ష్యానికి స్వస్తి పలికి వారికి అప్పగించిన కేసుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ పురోగతి సాధించే అవకాశం ఉంటుందన్న ఉద్ధేశంతోనే డివిజన్ స్థాయి అధికారి ఈ వ్యూహాలకు పదును పెట్టారని తెలిసింది. ప్రస్తుతం కేసుల విషయంలో సత్ఫలితాన్నిచ్చినప్పటికీ మున్ముందు మార్పు అనేది ఏ విధంగా జరుగుతుందో వేచిచూడాల్సిందే.


No comments:
Post a Comment