మాస్క్ ఉంటేనే...
విద్యాసంస్థలు, కార్యాలయాల్లో స్వైన్‌ప్లూ నిబంధనలు
మాస్క్ లేకుంటే రావద్దని ఆదేశాలు
పంపిణీ చేయని సర్కార్
మార్కెట్లో మాస్క్‌లకు భలేగిరాకీ
‘స్వైన్‌ప్లూ వైరస్ ప్రాబల్యం నగరంలో ఎక్కువగా ఉంది. దీని బారిన పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి పాఠశాలకు హాజరుకావాలి. తల్లిదండ్రులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీ పిల్లలకు మాస్క్‌లతోనే సోమవారం నుంచి పాఠశాలలకు పంపించాలి..’ ఇది నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో నోటీస్ బోర్డులో పెట్టిన వివరాలు. ఇది కేవలం ఈ ఒక్క పాఠశాలలోనే కాదు. దాదాపు అన్ని కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలల్లో ఇలాంటి నోటీసు బోర్డుల్లో ప్రకటనను అతికించారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విస్తరిస్తున్న స్వైన్ ప్లూను అరికట్టేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రారంభించింది. అయితే దీన్ని సాకుగా చూపుతూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు, ప్రయివేటు సంస్థలు మాస్క్‌లతోనే రావాలనే నిబంధనను జారీ చేశాయి. కొన్ని పాఠశాలలు ఇదువరకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. శనివారం పలు పాఠశాలల్లో మాస్క్‌లు ధరించి రాకుంటే ఇళ్లకు తిప్పిపంపిన ఘటనలూ ఉన్నాయి. సోమవారం నుంచి మాస్క్ తో రాకపోతే విద్యార్థుల నుంచి ఫైన్ వేస్తామని ప్రకటించారని కూకట్‌పల్లిలో ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో తన కొడుకును చదివిస్తున్న తండ్రి వాపోయారు. వేలాది రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తల విషయంలో యాజమాన్యమే మాస్క్‌లు ఇవ్వకుండా, వేధించడం సరికాదని వాపోయారు. పాఠశాలలు, కళాశాలల్లోనూ ఇలాంటి కనిపిస్తోంది. వీటికి తోడు ప్రయివేటు సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీల్లోనూ యాజమాన్యాలు ఇలాంటి నిబంధనలు పెట్టారు. శుక్రవారం నుంచే మాస్క్‌లతో రావాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు వారు పేర్కొంటున్నారు. మాస్క్‌లతో రాని వారిని గేట్ బయటే నిలిపి, వాటిని పెట్టుకుని వచ్చే వరకు లోపలికి రానివ్వలేదు. ఇవన్ని స్వైన్‌ప్లూ నివారణకే కదా అని అందరూ యాజమాన్యాలకు ఎవ్వరూ ఎదురు తిరగడం లేదు.
మాస్క్‌లకు భలే గిరాకీ..
స్వైన్ ప్లూ నివారణలో ప్రస్తుతం మాస్క్‌లు కీలకపాత్ర పోశిస్తున్నాయి. దీంతో వీటి వాడకం ఎక్కువైంది. ఇప్పుడెక్కడ చూసినా జనాలు మాస్క్‌లను ధరించి దర్శనమిస్తున్నాయి. మెడికల్ షాపుల్లో వీటి గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. దీంతో షాపుల యాజమానులు ఐదు రూపాయలున్న మాస్క్‌లకు రూ.15 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఇదేంటని వినియోగదారులు ప్రశ్నిస్తే.. మీ ఇష్టం ఉంటేనే తీసుకోండని తెగేసీ చెబుతున్నారు. చిన్నపిల్లలకు స్వైన్‌ఫ్లూ త్వరగా సోకుతుందని వార్తలు రావడంతో తల్లిదండ్రులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నగరంలో ఎక్కువగా వినియోగిస్తుండటంతో షాపుల్లోనూ ఇవి దొరకడం లేదు.
మాస్క్‌లను పంపిణీ చేయని సర్కార్..
నగరంలోని ప్రజలను కొన్ని రోజులుగా వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అది కనిపించడం లేదు. ఇప్పటికే జిల్లాలో సుమారు 13 మంది అధికారికంగా మరణించారు. మరో 160 మంది వరకు వ్యాధి సోకి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మాస్క్‌లు ధరించే బయటకు రావాలని ప్రచారం చేస్తోంది. కానీ సర్కార్ మాత్రం ఉచితంగా మాస్క్‌లకు పంపిణీ చేయాల్సి ఉన్నా అదేదీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా పంపిణీ చేసినా.. పూర్తి స్థాయిలో నగర ప్రజలకు చేరడం లేదు. ప్రభుత్వం కొన్ని ఆసుపత్రుల్లో పంపిణీ చేస్తున్నట్లు చెబుతున్నా.. పెద్దగా కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మాస్క్‌లకు ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయాలని ప్రజలకు కోరుతున్నారు.



No comments:
Post a Comment