రైతన్నను నిండా ముంచిన వర్షం
మంథని యార్డులో తడిచిన 7 వేల క్వింటాళ్ళ ధాన్యం
వరదనీటిలో కొట్టుకుపోయిన వందలాది క్వింటాళ్ళు
ఆదిలాబాద్ లోనూ రైతును ముంచేసిన వైనం
మెదక్ జిల్లాలో నేలకూలిన ఫౌలీ్ట్ర ఫారాలు
కరీంనగర్/ఆదిలాబాద్, జనవరి 3: తెలంగానలోని పలు జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. బుధవారం నుంచి వివిధ ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో నమోదైన వర్షం శనివారం నాటికి పెనుగాలులతో విరుచుకుపడింది. దీంతో పలు ప్రాంతాల్లో చేతికందునుకున్న పంట కాస్తా నీటిపాలైంది. ప్రధానంగా కరీంనగర్ జిల్లాను అకాలవర్షం అతలాకుతలం చేసింది. శనివారం ఉదయం నుంచి ప్రారంభమైన వర్షం మధ్యాహ్నం వరకు ఎడతురిపి లేకుండా కురిసింది. జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్, హుస్నాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, మంథని తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వర్షంతో మంథని డివిజన్‌లోని మంథని, కాటారం, మల్హర్, మహదేవపూర్ మండలాల్లోని వేలాది క్వింటాళ్ళ వరి, పత్తి, మిర్చి పంటలకు తీత్ర నష్టం వాటిల్లింది. శనివారం మధ్యాహ్నం దాదాపు గంటపాటు బలమైన గాలులు వీయగా మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. మంథని మార్కెట్ యార్డులోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో తూకం కోసం సిద్ధం చేసిన దాదాపు 7 వేల క్వింటాళ్ళ వరి ధాన్యం తడిచి ముద్దైంది. మరో 100 క్వింటాళ్ళ మేర ధాన్యం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. అనుకోని ఉపద్రవంలా వచ్చిపడిన వర్షం కారణంగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కలత చెందుతున్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్హర్ మండలం కొయ్యూర్‌లో రైతులు ధర్నా నిర్వహించారు. మరోవైపు భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెజ్జంకి మండలం మైలారం గ్రామంలో మొక్కజొన్న నేలవాలింది. పెగడపల్లి మండలంలో ఈదురు గాలులు వీచాయి. అకాల వర్షం... వరి పొలాలు దున్నుకుంటున్న అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతుండగా, పత్తి, మామిడి రైతులను ఆందోళనకు గురి చేసింది. తిర్మలాపూర్‌లో కల్లెం తిరుపతికి చెందిన రేకుల షెడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. అలాగే గ్రామంలో ఈదురు గాలులతో వర్షాల వల్ల 12 విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా రైతులనూ అకాల వర్షం అతలాకుతలం చేసింది. బుధవారం మొదలైన వర్షం గురువారం మధ్యాహ్నం వరకు కురిసింది. దీంతో పంటలు దెబ్బతిన్నాయి. తాండూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు రైస్ మిల్లులో నిలువ ఉంచిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రూ.5లక్షల వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. వేమనపెల్లిలో దాదాపు 100 ఎకరాల్లో కోసిన వరి పంట నీట మునిగింది. జన్నారం, దండేపల్లి మండలాల్లో వరి ,పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. 50 ఇళ్లు పూర్తిగా నేలకూలాయి. ఈదురు గాలులకు సుమారు 100 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాలు చీకటిలో కూరుకుపోయాయి. కోటపెల్లి మండలంలో 450 ఎకరాల్లో వరి, 2500 ఎకరాల్లో పత్తి,1100 ఎకరాల్లో మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్ గ్రామంలో మొక్కజొన్న, వరి పంటలు వర్షానికి దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే, శనివారం తెల్లవారుజాము నుంచి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. ఈదురు గాలులతో విరుచుకుపడిన వర్షం కారణంగా దౌల్తాబాద్ మండలం శేరిపూర్, వెల్దుర్తిల్లో కోళ్ల ఫారాలు ధ్వంసమయ్యాయి. దీంతో శేరిపూర్‌లో మూడు వేల కోళ్లు, వెల్దుర్తిలో రెండు వేల కోళ్లు మృతిచెందాయి. గజ్వేల్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో చిక్కుడు, టమోట తదితర కూరగాయల పంటలకు, కంది, శనగ తదితర పప్పు దినుసు పంటలకు నష్టం వాటిల్లింది.


No comments:
Post a Comment