అధ్యాపకులను తొలగించాలని నిరాహారదీక్షలు
జెఎన్‌ఎఎఫ్ఎయులో విద్యార్థుల ఆందోళన
మద్ధతుగా ఎస్‌ఎఫ్ఐ తరగతుల బహిష్కరణ
విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య గొడవ చిలికి చిలికి గాలివానల తయారవుతోంది. జవహార్ లాల్ నెహ్రూ అర్టికల్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన అధ్యాపకులు, చదువులు చెప్పకుండా విద్యార్థుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తూ వారిని వెంటనే తొలగించాలని బుధవారం కళాశాల ఆవరణలో నిరాహారదీక్షలకు దిగారు. విద్యార్థుల ఆందోళనకు మద్ధతుగా ఎస్‌ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు.
నగరంలోని మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహార్ లాల్ నెహ్రూ అర్టికల్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీలోని యానిమేషన్ విభాగంలో సుమారు 160 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం ఎనిమిది మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. అయితే అధ్యాపకులు రెగ్యూలర్‌గా పాఠాలు చెప్పకుండా విద్యార్థులతో రాజకీయాలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని ఆందోళన బాట పట్టారు. ఆ కోర్సు విద్యార్థులు గత 18 రోజులుగా నిరవధికంగా తరగతుల బహిష్కరణతో పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా యూనివర్శిటీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. దీంతో బుధవారం కళాశాల ఆవరణలో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. బుధవారం దీక్షల్లో విద్యార్థులు జీవన్, మల్లేష్, ప్రవీణ్, పవన్, క్రిష్ణ, ప్రక్రిత్ తదితరులు కూర్చున్నారు. ఈ యూనివర్శిటీ విసి పద్మావతి విద్యార్థులను చర్చలకు పిలిచి, సమస్యను పరిష్కరించకుండా చోద్యం చూస్తుందని ఆరోపిస్తూ విద్యార్థులు యూనివర్శిటీ ఆవరణలో ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యానిమేషన్ విభాగం విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ఎస్‌ఎఫ్ఐ యూనివర్శిటీ కమిటీ మద్ధతు ప్రకటించింది. వారి ఆందోళనకు మద్ధతుగా యూనివర్శిటీలోని ఇతర విభాగాలకు చెందిన తరగతులను బహిష్కరించారు. ఈ సందర్భంగా యూనివర్శిటీ ఎస్‌ఎఫ్ఐ కార్యదర్శి గోపి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని కోరారు.


No comments:
Post a Comment