యువత వ్యవసాయం వైపు రావాలి. ఆధునిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేసి నిరుద్యోగ సమస్య లేకుండా చూడొచ్చు. భవిష్యత్ తరాలకు ఆహార భద్రత కల్పించి హైఫైగా ఉండేట్లు చేసేది సాగు మాత్రమేనంటున్నారు
నవరత్న క్రాప్ సైన్స్ ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మన్నెం సరితారెడ్డి. రైతులకు ఉచితంగా సలహాలు.. సూచనలిస్తూ ఆధునిక వ్యవసాయంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్న సరితారెడ్డి గురించి..
ఒక రైతు వరి పండిస్తే.. గ్రామంలోని రైతులంతా వరినే పండిస్తున్నారు. దీంతో పంట దిగుబడి పెరిగినా గిట్టుబాటు రావడం లేదు. రసాయన ఎరువుల వాడకంలో సహజమైన సూక్ష్మ జీవులు నశించి పంటలు సూక్ష్మధాతు లోపానికి గురవుతున్నాయి. నగరీకరణతో సాగుభూమి నానాటికీ తగ్గిపోతున్నది. అందుకే రైతుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు సరితరెడ్డి. జీవ సేంద్రీయ ఎరువుల వాడకంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో వర్క్‌షాపులు నిర్వహించారామె.
పంట మార్పిడి, భూసార సంరక్షణపై సదస్సులు కూడా నిర్వహించి.. చెరకు, కూరగాయలు, పంటల సాగు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. భూసార పరీక్షల ద్వారా ఏ ప్రాంతంలో ఏ పంటకు అనువైన ప్రదేశమో గుర్తించొచ్చు. కానీ మన దగ్గర భూసార పరీక్ష కేంద్రాలు లేక రైతులు ఈ విధమైన ప్రగతి సాధించడంలో వెనకబడిపోతున్నామం టున్నారు సరితారెడ్డి.
అర్బన్ అగ్రికల్చర్ మేలు..
రాజేంద్రనగర్‌లోని ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ అగ్రికల్చరల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సరితరెడ్డి వాళ్ల నవరత్న కంపెనీలో ప్రాజెక్టువర్క్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. స్వయంగా విద్యార్థులను పొలాల్లోకి తీసుకువెళ్లి సబ్జెక్టుపై లోతుగా అధ్యయం చేయిస్తారు. వ్యవసాయరంగంలో సరిత చేస్తున్న కృషికి 2014 ఫిబ్రవరిలో జాతీయ అవార్డు.. తర్వాత అంతర్జాతీయ పురస్కారంతో పాటు ఉత్తమ మహిళా పారిశ్రామిక వేత్తగా పురస్కారం లభించింది.
మహానగరాల్లో అర్బన్ అగ్రికల్చర్ మేలు. హైదరాబాద్ నగరంలో కాలనీల్లో చాలా ఖాళీ స్థలాలున్నాయి. ఆ స్థలాలను గుర్తించే బాధ్యత జీహెచ్‌ఎంసీ చేపట్టి.. నిరుద్యోగ యువత, పదవీ విరమణ పొందిన వారిని వ్యవసాయ రంగం వైపు ప్రోత్సహించాలని ఆమె అంటున్నారు. ఖాళీ ప్లాట్లలో కూరగాయాలు పండించినట్లయితే ఉపాధి దొరుకుతుంది. ఇళ్ల బాల్కనీల్లో, మెట్లపై, టెర్రాస్‌పై ఆకుకూరలు, తీగజాతి మొక్కల్ని పెంచే విధంగా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందనేది ఆమె ఆలోచన.
వారి బాధలు చూడలేకే..
మాది మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామం. నాన్న క్రిష్ణారెడ్డి రైతు. బాల్యం ఊళ్లోనే గడిచింది. చిన్ననాటి నుంచి రైతుల బాధలు చూసి చలించిపోయేదాన్ని. రైతు కోసం ఏదైనా చేయాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నా. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చాం. డాక్టర్ కావాలని కోరిక. లయోలా కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చరల్‌లో డిగ్రీ చేశాను. బీఎస్సీ అగ్రికల్చరల్ పూర్తిచేసిన తర్వాత ఆరేళ్లు ఉద్యోగం చేశా. కెరీర్ బావుంది. అయినా ఎంత చేసినా ఉద్యోగం ఉద్యోగమే కదా అనే ఆలోచనల్లో పడ్డా. ఉద్యోగం నా లక్ష్యం నేరవేర్చగలదా? అని ఆలోచిస్తున్న క్రమంలో సొంత కంపెనీ ఏదైనా పెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించా. నాతోపాటు ఉద్యోగం చేసిన భాషాతో కలిసి నవరత్న క్రాప్ సైన్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించా. నాలుగేళ్లుగా సూక్ష్మ పోషక ఎరువులు, జీవ సేంద్రియ ఎరువులతో నాణ్యమైన, అధిక దిగుబడులు సాధిస్తున్నాం.
చిన్నప్పట్నుంచి రైతుల కష్టాలు చూసినదాన్ని కాబట్టి.. వారికి ఏదైనా చేయాలనే పట్టుదలతో ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఉద్యోగాన్ని సైతం వదిలేసి వ్యవసాయ రంగంవైపు అడుగులు వేశాను. నేను వేసిన అడుగులు కరెక్టేనని.. తీసుకున్న నిర్ణయం సరైనదేనని చాలామంది పెద్దలు ప్రశంసించారు. సాగులో ఫలితాలు కూడా ఆ స్థాయిలో సాధిస్తున్నా. నేటి యువత ఉద్యోగమే కావాలని సమయం వృథా చేసుకోకుండా స్వశక్తితో అభివృద్ధి సాధించి.. భవిష్యత్ తరాలకు ఆహార ఉత్పత్తికి మార్గదర్శకులయ్యే అన్నదాతలుగా మారితే దేశం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నా.


No comments:
Post a Comment