కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బిజెపికి ఓటమి ఎదురైనంత మాత్రాన దేశంలో ఆర్థిక సంస్కరణల వేగం తగ్గబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో బిజెపి కేవలం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొంది దాదాపు తుడిచిపెట్టుకుపోయిన విషయం విదితమే. అయినప్పటికీ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల విషయంలో అనుకున్నట్టుగానే ముందుకు సాగాలని కృతనిశ్చయంతో ఉందని జైట్లీ తేల్చిచెప్పారు. ‘ఇటీవల శాసనసభ ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన బిజెపి, కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఓటమి చెందింది. అంతమాత్రాన మేము చేపట్టిన ఆర్థిక సంస్కరణల వేగం తగ్గుతుందని భావించడం సరికాదు’ అని ఆయన అన్నారు. ఇండో-అమెరికా 5వ ఆర్థిక భాగస్వామ్య సమావేశం ముగిసిన అనంతరం అమెరికా ఆర్థిక శాఖ కార్యదర్శి జాకబ్ ల్యూతో కలసి గురువారం న్యూఢిల్లీలో సంయుక్త విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జైట్లీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బిజెపికి ప్రతికూల ఫలితాలు ఎదురైనందున కేంద్ర ప్రభుత్వం ప్రజాకర్షక విధానాలను అనుసరించవచ్చని నిపుణులు సందేహాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు విస్తృత ఉపాధి అవకాశాలను సృష్టించేవిగానూ, పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేవిగానూ ఉంటాయని జైట్లీ చెప్పారు. ఎన్‌డిఎ ప్రభుత్వ తొలి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను జైట్లీ ఈ నెల 28వ తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరించే వ్యూహాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా జాతికి వివరించనున్నారు


No comments:
Post a Comment