న్యూయార్క్, ఫిబ్రవరి 11: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం స్వదేశంలోనే కాదు, విదేశీ మీడియాలోనూ చర్చకు దారితీసింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించి చరిత్ర సృష్టించిన బిజెపి, పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగించిన విషయం విదితమే. అయితే సాక్షాత్తూ దేశ రాజధానిలో హోరాహోరీగా సాగిన పోరులో బిజెపి అవమానకర రీతిలో ఓటమి చెందడాన్ని విదేశీ పత్రికలు ప్రముఖంగా ప్రస్తావించాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీని నేల మీదకు తీసుకొచ్చాయని న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ బోర్డు వ్యాఖ్యానించింది. ఆర్థిక, పాలనాపరమైన అంశాల్లో మోదీ ఇచ్చిన హామీల అమలులో తీవ్ర ఒత్తిడి పెరిగే పరిస్థితిని ఢిల్లీ ఫలితాలు తీసుకొచ్చాయని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలతో దౌత్యపరంగా విజయం సాధించిన నరేంద్ర మోదీని దేశీయంగా జరిగిన ఎన్నికల ఫలితాలు వాస్తవంలోకి తీసుకొచ్చాయని పేర్కొంది. ‘ఎ డిఫీట్ ఫర్ నరేంద్రమోదీ’ శీర్షికతో ప్రచురితమైన సంపాదకీయంలో - 70మంది సభ్యులు కలిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, బిజెపికి ఘోర పరాజయం ఎదురైందని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది.
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని కొత్త ప్రాంతీయ పార్టీ ఆమ్ ఆద్మీ (ఆప్) చేతిలో చిత్తుగా ఓడిపోయారని పేర్కొంది. 67 సీట్లతో ఆప్ విజయదుందుభి మోగించగా, కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి మూడు సీట్లతో సరిపెట్టుకుందని తెలిపింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు దశాబ్దాల బిజెపి చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని నమోదు చేసి జైత్రయాత్ర కొనసాగిస్తున్న నరేంద్ర మోదీని ఢిల్లీ ఫలితాలు నేలమీదకు తీసుకువచ్చాయని వ్యాఖ్యానించింది. ఢిల్లీ ఫలితాల వల్ల మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా, ఆయన ఇచ్చిన హామీల అమలులో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ ఎన్నికలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించకపోయినా, గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జయభేరి మోగించిన నరేంద్ర మోదీ వరుస విజయాలను నమోదు చేసుకున్నారు. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ పార్టీకి విజయాన్ని చేకూర్చారు. అలాంటి నాయకుడ్ని ఢిల్లీ ఫలితాలు వాస్తవాన్ని గుర్తించేలా చేశాయని ఆ సంపాదకీయం వ్యాఖ్యానించింది.


No comments:
Post a Comment