న్యూఢిల్లీ, మార్చి 22: భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షాలు రాజకీయ కారణాలతో అబద్ధాలు వ్యాప్తిచేస్తున్నాయని, రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భూసేకరణ చట్టానికి ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు తమ ఆందోళన తీవ్రం చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా రైతులకు చేరువకావడానికి ప్రయత్నించారు. ప్రతి నెలా ఆకాశవాణి ద్వారా చేసే ‘మన్‌కీ బాత్’ ప్రసంగంలో భాగంగా ఆదివారం మోదీ భూసేకరణ బిల్లు, రైతుల సమస్యలపై ప్రధానంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు అనేక సూచనలు, సలహాలు పంపిన రైతులను ఆయన అభినందించారు. 2013 భూసేకరణ చట్టంలోని రైతులకు మేలుచేసే అన్ని నిబంధనలూ కొత్త బిల్లులో చేర్చామన్నారు. ‘యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం 2013లో భూసేకరణ బిల్లును ఆమోదించటలో తొందరపాటు ప్రదర్శించింది. అందుకే దీనిలో అనేక లోసుగులు చోటుచేసుకున్నాయి. లొసుగులు తొలగించేందుకే ఎన్డీయే కొత్త బిల్లు ప్రతిపాదించింది అని మోదీ వివరించారు. 13 చట్టాలను భూసేకరణ బిల్లు పరిధిలోకి తెచ్చామన్నారు. పాతచట్టం ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు పాత రేట్ల ప్రకారం నష్టపరిహారం లభించేది. అయితే ఎన్డీయే ప్రతిపాదించిన సవరణ బిల్లు ప్రకారం భూములిచ్చిన రైతులకు పూర్తి నష్టపరిహారం లభిస్తుంది అని మోదీ తెలిపారు. సేకరించిన భూమికి మార్కెట్ రేటు ప్రకారం నాలుగింతల నష్ట పరిహారం చెల్లించే విధానాన్ని యథాతథంగా బిల్లులో పొందుపర్చామన్నారు. పట్టణీకరణకు సేకరించే భూమికిగాను రైతులకు అభివృద్ధి చేసిన 20 శాతం భూమి లభిస్తుందని చెప్పారు. భూమినిచ్చిన రైతుల కుటుంబానికే కాదు, సేకరించిన భూమిలో పనిచేసే వ్యవసాయ కూలీల కుటుంబాలకూ ఉపాధి కల్పించే నిబంధన ఎన్డీయే రూపొందించిన బిల్లులో ఉందన్నారు. ఎలాంటి అవకాశాలు లేనపుడే చివరి ప్రాధాన్యతగా సారవంతమైన భూమి సేకరిస్తామని మోదీ స్పష్టం చేశారు. బంజరుల లభ్యతపై వెంటనే సర్వే చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు ప్రధాని వివరించారు. ఎన్డీయే తెస్తున్న కొత్తచట్టం ఇష్టం లేకుంటే అమలు చేయకుండా ఉండే వీలు కల్పించామన్నారు. కార్పోరేట్ సంస్థలు, ప్రయివేట్ సెక్టార్‌కు ప్రయోజనం కల్పించేందుకే బిల్లు తెస్తున్నట్టు కొందరు చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నారు. హైవేలు, రైల్వేలు, బీదవారికి ఇళ్ళ నిర్మాణం, నీటిపారుదలు ప్రాజెక్టుల కోసం చేస్తున్న భూసేకరణ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగిస్తుందా? అని ప్రశ్నించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల్లో రైతులు పంటలు కోల్పోవడం పట్ల మోదీ విచారం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు ఎన్డీయే అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు తనకు రాసిన ఉత్తరాల్లో ప్రస్తావించిన పలు సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులను సాధికారులను చేసేందుకు మట్టి ఆరోగ్య కార్డులను విడుదల చేస్తామన్నారు. దీనివల్ల ఎరువుల అనవసర ఉపయోగం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తేవాలని రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు


No comments:
Post a Comment