ఇబ్రహీంపట్నం, మార్చి 22: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుడా ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గ పరిధిలోని మంచాల, యాచారం, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాలల్లో మొత్తం 64.9 శాతం పోలింగ్ నమోదయ్యింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,172 ఉండగా వారిలో 2581 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో మొత్తం ఓటర్లు 1307 ఉండగా వారిలో 822 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 62.9 శాతం పోలింగ్ నమోదైంది. మంచాల మండలంలో మొత్తం ఓటర్లు 693 ఉండగా, వారిలో 446 మంది ఓటుహక్కును వినియోగించుకోగా 64.36 శాతం పోలింగ్ నమోదయ్యింది. యాచారం మండలంలో 593 మంది ఓటర్లు ఉండగా 441 మంది ఓట్లు వేయగా, 74.4 శాతం ఓట్లు పోలయ్యాయి. హయత్‌నగర్ మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1579 కాగా, వాటిలో 872 ఓట్లు పోలయ్యి 55.2 శాతం పోలింగ్ శాతం నమోదయ్యింది. నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ శాతం యాచారం మండలంలో నమోదు కాగా, మంచాల మండలంలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, యాచారం, మంచాల, హయత్‌నగర్ మండలాల పరిధిలోని జడ్పిహెచ్‌ఎస్ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
పోలింగ్ సరళిని పరిశీలించిన డిసిపి
ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని ఎల్‌బినగర్ డిసిపి తప్సీర్ ఇక్బాజ్ పర్యటించి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు చేపట్టామని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని చెప్పారు. ఆయనతో పాటుగా డిసిసి అధ్యక్షులు క్యామ మల్లేష్, టిడిపి జిల్లా అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు పోలింగ్ బూత్‌లను సందర్శించి, పోలింగ్ సరళిని పరిశీలించారు.
మిత్రపక్షాల అభ్యర్థి విజయం ఖాయం: మంచిరెడ్డి
ఇబ్రహీంపట్నం, మార్చి 22: తెదేపా, భాజపా, లోక్‌సత్తా, బిసి సంఘాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావు విజయం ఖాయమని తెదేపా జిల్లా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం పట్నంలో పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతర్ టిడిపి, బిజెపి నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గడిచిన తొమ్మిది నెలలుగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభించిన ప్రజావ్యతిరేక విధానాలపై విద్యావంతులు తిరుగుబాటు చేసినట్లుగా ఓట్లు వేశారని వివరించారు. పోలింగ్ సరళిని విశే్లషిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతున్నదని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టిన టిఆర్‌ఎస్ పాలకులు విద్యావంతులను మభ్యపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగ యువతను నిలువునా వంచించినందుకు వారు ప్రతీకారానికి సిద్ధమయ్యారని చెప్పారు. పిఆర్‌సి అమలు, ఉద్యోగుల ఆరోగ్యకార్డుల విషయంలో మాయమాటలు చెప్పాలని చూసినా ఉద్యోగులు తిప్పికొట్టారని అన్నారు. టిఆర్‌ఎస్ పాలనతో ఏ ఒక్కరు కూడా సంతృప్తిగా లేరని ఈ విషయం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తేలుతుందన్నారు. టిడిపి జిల్లా ప్రచార కార్యదర్శి సత్తు వెంకటరమణారెడ్డి, రాష్ట్ర బిజెపి నేతలు పి నర్సింహారెడ్డి, ప్రతాప్, జడ్పిటిసి అయిలయ్య, నగరపంచాయతీ చైర్మన్ భరత్‌కుమార్, అసెంబ్లీ బిజెపి కన్వీనర్ ముత్యాల భాస్కర్, బిజెపి మండల అద్యక్షులు రమణారెడ్డి, టిడిపి అధ్యక్షులు నిరంజన్‌రెడ్డి, మోరుూజ్‌పాషా, మహేష్‌గౌడ్, యాదగిరిలు పాల్గొన్నారు.


No comments:
Post a Comment