సిడ్నీ, మార్చి 22: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్ దశ ముగిసింది. సెమీ ఫైనల్‌లో నాలుగు జట్ల మధ్య పోరాటం సహజం. అదే సమయంలో ఆయా జట్ల కోచ్‌ల మధ్య ఆధిపత్య పోరు కూడా జరగనుంది. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాయి. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)తో కోచ్ డంకన్ ఫ్లెచర్ కాంట్రాక్టు వరల్డ్ కప్‌తో ముగుస్తుంది. అతని ఒప్పందాన్ని కొనసాగించే అవకాశాలు ఏమాత్రం లేవు. జట్టుకు డైరెక్టర్ పదవిని సృష్టించి మరీ మాజీ కెప్టెన్ రవి శాస్ర్తీకి బిసిసిఐ విస్తృత అధికారాలు కట్టబెట్టడమే ఫ్లెచర్ భవిష్యత్తు ఏమిటో స్పష్టం చేస్తున్నది. ఇలావుంటే, ప్రపంచ కప్ పోటీలకు ముందు మ్యాచ్‌లు ఆడిన, ఇప్పుడు ఆడుతున్న టీమిండియా ఒకటేనా అన్న అనుమానం తలెత్తుతోంది. వరల్డ్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ఆ వెంటనే, ఇంగ్లాండ్ కూడా పాల్గొన్న ముక్కోణపు వనే్డ సిరీస్‌లోనూ పరాజయాలను మూటగట్టుకుంది. కానీ, ప్రపంచ కప్ టోర్నీ ఆరంభమైన మరుక్షణం నుంచి జట్టు ఆట తీరు ఒక్కసారిగా మారింది. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. ఆతర్వాత మరో ఐదు వరుస విజయాలు సాధించి క్వార్టర్స్ చేరింది. అదే ఊపును కొనసాగిస్తూ, బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకొచ్చింది. టీమిండియా జైత్రయాత్రలో రవి శాస్ర్తీ పాత్ర కీలకమన్నది వాస్తవం. అయితే, ఈఘనతలో కోచ్‌గా ఫ్లెచర్‌కు కూడా భాగస్వామ్యం ఉండకపోదు. కాంట్రాక్టు నిలబడాలన్నా లేదా ఇతర క్రికెట్ బోర్డుల నుంచి ఆహ్వానం అందాలన్నా ఫ్లెచర్‌కు ఆస్ట్రేలియాతో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ కీలకంగా మారింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ టైటిల్ నిలబెట్టుకుంటే ఫ్లెచర్‌కు డిమాండ్ పెరుగుతుంది. భారత్‌కు కాకపోయినా, మరో మేటి జట్టుకు కోచ్‌గా వెళ్లే అవకాశం లభిస్తుంది.
భారత్ మాదిరిగానే గ్రూప్ దశలో ఆరు మ్యాచ్‌లతోపాటు క్వార్టర్ ఫైనల్స్‌లోనూ గెలిచిన న్యూజిలాండ్‌కు కోచ్ మైక్ హెస్సన్ అసాధారణ సేవలు అందిస్తున్నాడు. 3అండర్ డాగ్2 ముద్ర వేయించుకున్న కివీస్ జట్టు ఇన్ని విజయాలను సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. 3బ్లాక్ క్యాప్2 ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కొనసాగించడం వెనుక హెస్సన్ కృషి ఎంతో ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగే సెమీ ఫైనల్‌లో కివీస్ నెగ్గితే, కోచ్‌గా హెస్సన్ నిలదొక్కుకుంటాడు.
ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతున్నాడు. జట్టు ఎప్పుడు ఏ విధంగా ఆడుతుందో తెలియని పరిస్థితి అతనిని ఆందోళనకు గురి చేస్తున్నది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు 3హాట్ ఫేవరిట్2 జాబితాలో ముందున్న ఆసీస్ ఆతర్వాత పడుతూలేస్తూ ముందుకు సాగుతున్నది. సమర్థులైన ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నా, ప్రతి మ్యాచ్‌లోనూ ఇద్దరుముగ్గురు మాత్రమే రాణిస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ జట్టుకు బంగ్లాదేశ్‌తో ఆడే అవకాశం వర్షం కారణంగా లభించలేదు. మిగతా నాలుగు గ్రూప్ మ్యాచ్‌లను గెల్చుకుంది. కానీ, ఆ విజయాలు ఆశించినంత గొప్పవేం కాదు. అయితే, మాజీ ఆటగాడు లీమన్ మార్గదర్శకంలో, క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌ను చిత్తుచేసి సెమీస్‌లోకి అడుగుపెట్టిన విధానం ఆసీస్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందన్న విషయాన్ని స్పష్ట చేస్తున్నది. కాగితంపై చూస్తే భారత్, ఆస్ట్రేలియా జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తాయి. రెండు జట్లకూ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇంతకు ముందు ఆసీస్ బౌలింగ్ బలంగా ఉంటే, భారత్ బౌలింగ్ విభాగంలో వెనుకంజలో నిలిచింది. కానీ, వరల్డ్ కప్‌లో భారత బౌలర్లు అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఏడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేయడమే టీమిండియా బౌలింగ్ మెరుగుపడిందనడానికి నిదర్శనం. కాబట్టి, బౌలింగ్‌లోనూ ఆసీస్‌తో భారత్ పోటీపడే స్థాయికి చేరింది. శక్తివంతమైన భారత్‌ను ఓడించగలిగితే, ఆసీస్ మళ్లీ గాడిలో పడడమేగాక, కోచ్‌గా లీమన్‌కు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే భారత్‌తో సెమీస్‌ను అతను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నాడు.
కీలక మ్యాచ్‌ల్లో తీవ్రమైన ఒత్తిడికిగురై పరాజయాలను ఎదుర్కొంటుందన్న ముద్ర నుంచి దక్షిణాఫ్రికాను బయటకు తెచ్చేందుకు కోచ్ రసెల్ డొమింగో బాగానే కష్టపడుతున్నాడు. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లతోపాటు క్వార్టర్ ఫైనల్స్‌ను కూడా గెల్చుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ను ఢీకొనడం దక్షిణాఫ్రికాకు అసాధ్యం కాకపోయినా సులభం మాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణాఫ్రికాను విజయపథంలో నడిపించి, కోచ్‌గా తనను తాను నిరూపించుకోవాలన్న తపన డొమింగోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఈరెండు జట్లూ ఎన్నడూ వరల్డ్ కప్ ఫైనల్ చేరలేదు. దీనితో ఏ జట్టు గెలిచినా కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుంది.


No comments:
Post a Comment