- వృత్తుల పరిక్షణకు కృషి
- సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి
- అధిపత్య భావజాలాన్ని చీల్చుతాం - తమ్మినేని
- జనజాతర ఎగ్జిబిషన్ ప్రారంభం
- చేతివృత్తుల పరిరక్షణకు సిపిఎం కృషి చేస్తుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబి అన్నారు. వారి జీవన విధానాలు మెరుగుపడేందుకు నిరంతరం పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జనజాతర కార్యక్రమాన్ని ఆదివారం ఆయన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రముఖ విద్యావెత్త కంచె ఐలయ్య, ప్రొఫెసర్ భంగ్యా భూక్యా, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జనజాతర కార్యక్రమం ప్రస్తుత పల్లె సంస్కృతిని ప్రతిభింబిస్తుందని అన్నారు. వృత్తుల జీవన విధానాలు కనిపించేలా చేనేత, చర్మకారులు,గిరిజన ఇలా అనేక అంశాలున్నాయి. శ్రామిక ప్రజలజీవన విధానాలు ఉట్టిపడేలా కళలు కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతి ప్రతిభింబించేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఆధిపత్యభావజాలాన్ని చీల్చేందుకు సిపిఎం సంస్కృతిక నినాదాన్ని తీసుకుందని అన్నారు.కమ్యూనిస్టులంటే కేవలం భూమి, కూలి పోరాటాలే కాదని, తెలంగాణాలోని అన్ని రంగాల్లోని ప్రజల సమస్యలపైనా పోరాడుతుందని తెలిపారు. తెలంగాణ సాయుధపోరాటంలో ఒకే రోజు 108 మంది అమరులైన వీరభైరాన్ పల్లి నుంచి తెలంగాణ సంస్కృతిక యాత్ర ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రజల సంస్కృతి వేరు, దోపిడీ సంస్కృతి వేరని, సకల వృత్తుల సమ్మేళనంగా, దోపిడీ సంస్కృతిని అడ్డుకునేందుకు ఈ కార్యక్రమం ఆరంభం మాత్రమేనని తమ్మినేని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి కృషి జరగాలని సూచించారు. ఉద్యమమంటే సిపిఎం మాత్రమే కాదని,వామపక్ష, సామాజిక, ప్రగతి శీల శక్తులు ఐక్యంగా పోరాటాలు చేయడమేనని అన్నారు. ఈ ఐక్యత కోసం నాలుగు రోజుల పాటు జరిగే రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామని అన్నారు. సంస్కృతికి ప్రతిబింబమైన జనజాతర కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ సీతారాములు మాట్లాడుతూ చేతివృత్తులు పూర్తిగా నాశనం అవుతున్నాయని, దీంతో వీరి ఆదాయవనరులు లేకుండా పోయాయని అన్నారు. వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారి బతుకులు బాగుపడాలంటే బడ్జెట్‌లో ప్రభుత్వం వారి జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. ప్రజల సంస్కృతి సంప్రదాయాలను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ ప్రజాసంస్కృతిక కేంద్రం ప్రతినిధులు భూపతి వెంకటేశ్వర్లు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి రమేష్,సిపిఎం రాష్ట్ర నాయకులు టి.సాగర్, రమ, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ ప్రతినిధులు రమణ,లెల్లెల బాలకృష్ణ, రమేష్, గిరిజన సంఘం నాయకులు శ్రీరాం నాయక్, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తదితరులు పాల్గొన్నారు.



No comments:
Post a Comment