శ్రమశక్తితోనే సైన్స్ అభివృద్ధి : కంచె ఐలయ్య
దేశాన్ని క్లీన్ గా ఉంచాలంటు ముందు శ్రమశక్తిని గౌరవించాలని ప్రముఖ విద్యావెత్త ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. శ్రమశక్తితోనే సైన్స్
అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రమను గౌరవ పాఠాలు పుస్తకాల్లో చేర్చాలని సూచించారు. జనజాతర కార్యక్రమంలో
భాగంగా ఏర్పాటు చేసిన చేతి వృత్తుల ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ భంగ్యా భూక్యాతో కలిసి ఆయన ప్రారంభించారు. చేతివృత్తులకు, శ్రమకు
గౌరవం లేదని ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసులు సైంటిస్టులని తాను 30 ఏళ్ల నుంచే చెబుతున్నానని అన్నారు. మాదిగలు
తోలుసంచిలో నీళ్లు తీసుకురావడం, మాలలు కాలువలు తవ్వడం, సాకలి వాళ్లు సౌడుమట్టితో సబ్బును కనిపెట్టారని అన్నారు. వేదం చరిత్రకు
మూలం కాదని కుండ మాత్రమే మూలమని పేర్కొన్నారు. బాపనోళ్లు కూడా అందరి ఇళ్ళలో తినేలా కమ్యూనిస్టులు కృషిచేయాలని
కోరారు. తెలంగాణ వచ్చాకా ప్రభుత్వం నిధులన్నీ దేవుడి గుళ్లకు పెడుతున్నారని,సచివాలయాన్ని వాస్తు పేరుతో మార్చాలని చూస్తున్నారని
అన్నారు. నగరంలో భూములు అమ్ముకునేందుకు ప్రభుత్వం అనేక విధాగాలుగా ప్రయత్నిస్తుందని దానిలో భాగంగానే హుస్సేన్ సాగర్ ఖాళీ
చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ప్రాణాలు పోయినా నగరంలో గుంట భూమికూడా అమ్మనీయమని అన్నారు. శ్రమకు
గౌరవంగా, వృత్తుల రక్షణకు సిపిఎం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అనంతరం భంగ్యాభూక్యా మాట్లాడుతూ మట్టిలో పనిచేసే
కులాలను నీచమైన పనులు చేసేవారిగా హిందుత్వశక్తులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. నేడు వృత్తులు కనుమరుగవుతున్న
తరుణంలో సిపిఎం జానజాతర పేరుతో వృత్తుల రక్షణ చేస్తున్న కృషి మంచిపరిణామమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు, హైందవ శక్తులు
కలిసి శ్రమకు, వృత్తులకు కొత్తరూపం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు.



No comments:
Post a Comment