టీఆర్‌ఎస్ నాయకుల అవినీతి సీబీ సీఐడీ విచారణ జరిపించాలి
మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్
నిజామాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకులు పాల్పడుతున్న అవినీతి, అక్రమాలపై సీబీ సీఐడీగాని, సీఐడీ చేత గాని విచారణ జరిపించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాస్కీ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ తదితర కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఏడాది పాలన అద్భుతమైన అబద్దాల పాలనగా కొనసాగిందన్నారు. ప్రజాస్వామ్యంలో అందరినీ కలుపుకుని పోవాల్సి ఉండగా.. కేసీఆర్ అహంకార పూరితంగా దొరల పాలన కొనసాగిస్తారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాక ముందు తెలంగాణ ఉద్యమంలో 2 వేల మంది అమరులయ్యారని పేర్కొన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కేవలం 400 మందికి మాత్రమే అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారన్నారు. గతంలోనే పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, ఏడాది పూర్తి అయిన తరువాత కూడా అదే హామీని మరోసారి ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మైనార్టీలకు 12 శాతం, దళితులకు ముఖ్యమంత్రి పదవి, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఇంకా నెరవేరలేదని కేసీఆర్ అబద్దాల పాలన కొనసాగిస్తున్నారన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళా సంఘాలకు రూ. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని మరచిపోరాని విమర్శించారు. అంతేగాక రైతులకు రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఇందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ టీఆర్‌ఎస్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో వ్యాపారస్తుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తాహేర్, కార్పొరేటర్ ఖుద్దూస్, కాంగ్రెస్ నాయకులు యోగి తదితరులు పాల్గొన్నారు.



No comments:
Post a Comment