గుంటూరు జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి దక్షిణంవైపు గాలిగోపురం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానే నూతన గాలిగోపురం నిర్మించేందుకై పునఃనిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొదటి దశ తవ్వకాల్లో కొన్ని శాతవాహనుల కాలంనాటి శిల్పాలు బయటపడ్డాయి. అలాగే రెండవ దశకోసం సుమారు 15 అడుగుల లోతు తవ్వకాలు చేస్తుండగా పీఠ భాగంలో క్రీస్తుశకం 1వ శతాబ్దానికి చెందిన శాతవాహన కాలంనాటి రాతికట్టడం బయటపడింది. సమాచారం తెలుసుకున్న వెంటనే హైదరాబాదు ఎఎస్‌ఐ మ్యూజియంకు చెందిన డెప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ దిట్టకవి కన్నబాబు, అమరావతి మ్యూజియం అధికారి ఎన్ వెంకటేశ్వరరావు, అమరేశ్వరాలయ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది బయల్పడిన ఇటుకరాతి గోడను పరిశీలించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ప్రస్తుతం శాతవాహన సామ్రాజ్యకాలం నాటి ఇటుకరాతి గోడతో పాటు కొన్ని మట్టిపాత్రలు కూడా లభ్యమయ్యాయన్నారు. సుమారు రెండు మీటర్ల వెడల్పు కల్గిన ఇటుకరాతి గోడ బయటపడిందన్నారు. ఈ తవ్వకాల్లోనే బ్రహ్మసూత్రంతో శిల్పీకరించిన చలువరాతి చిన్న శివలింగం కూడా బయటపడిందన్నారు. అమరావతిలో బౌద్ధం, శైవం రెండూ సమకాలీనంగా అభివృద్ధి చెందినట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయన్నారు. చరిత్రకారులు భావిస్తున్నట్లుగా బౌద్ధస్థూపం కట్టడాలపై అమరేశ్వరాలయం నిర్మించి ఉందని చెప్పడం సబబు కాదన్నారు. ఇక్కడ మహాచైత్యం, అమరేశ్వరాలయం సమకాలీనంగా అభివృద్ధి చెందాయన్నారు. అదృష్టవశాత్తు ఈ గాలిగోపురం పునర్నిర్మాణ తవ్వకాల్లో 1వ శతాబ్దం నాటి రాతిగోడ బయటపడటంతో క్రీస్తుశకం 14వ శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధం ఉచ్ఛ్వస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. కిందిస్థాయి పొరల్లో బౌద్ధస్థూపానికి సంబంధించిన అవశేషాలేవీ లభించకపోవడం విశేషమన్నారు.
అమరేశ్వరాలయ గాలిగోపుర పునాది, శాతవాహన కాలంనాటి గోడ.
No comments:
Post a Comment