- రూ. 52 కోట్లు మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ
- 100 యూనిట్ల లోపు వినియోగదారులకు వర్తింపు
- ఆపైబడిన వారు మార్చిలోపు చెల్లిస్తే సర్‌చార్జీ రద్దు
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు శుభవార్త. 100 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే వారి బకాయిలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 100 యూనిట్లకు పైబడి కరెంట్ వినియోగిస్తున్న వారు మార్చి 31లోపు బకాయిలు చెల్లిస్తే సర్ చార్జీని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రూ.52.42 కోట్లను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ పరిధిలోని గృహ వినియోగదారులకు సంబంధించి 100 యూనిట్లలోపు విద్యుత్ బకాయిలను రద్దు చేయడంతోపాటు 100 యూనిట్లకు పైగా బకాయిలున్నవారు మార్చి 31 నాటికి బకాయిలను చెల్లించే వెసులు బాటును తెలంగాణ సర్కారు కల్పించింది.
రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లోని బకాయిలను సైతం ఒకేసారి చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. ఇదిలా ఉండగా 2015 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల బకాయిలు సుమారు రూ.1923 కోట్లు ఉన్నాయి. అన్ని ప్రభుత్వశాఖల్లో విద్యుత్‌ను పొదుపు చేసేందుకు అనుగుణంగా ప్రీ పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఏప్రిల్ 1 నాటికి ప్రీ పెయిడ్ మీటర్లను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇందులో భాగంగా మార్చి 31లోగా మీటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ స్టేట్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్), టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లను ఆదేశించింది ప్రభుత్వం.



No comments:
Post a Comment