భీమ్‌గల్, జనవరి 2: నేరాలను నియంత్రించేందుకు వీలుగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సి.సి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శనివారం భీమ్‌గల్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సి.సి కెమెరాలను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సి.సి కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల దొంగతనాలను చాలావరకు నివారించవచ్చని, ఎవరైనా అపరిచితులు, కొత్త వ్యక్తులు వచ్చినా గుర్తించవచ్చని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే నిందితులను సులభంగా గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో సి.సి కెమెరాల ఏర్పాటు కోసం తగు చర్యలు చేపట్టామన్నారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అనంతరం వీటిని గ్రామాల్లోనూ అమరుస్తామని వివరించారు. సి.సి కెమెరాల ఏర్పాటుకై ఆయా గ్రామాల ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. భీమ్‌గల్ పట్టణంలో సి.సి కెమెరాల ఏర్పాటు కోసం పోలీసు శాఖకు సహకరించిన వ్యాపారులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు సైతం ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేయాలని సూచించారు. పోలీసుల పట్ల ఉండే భయాన్ని పారదోలేందుకు ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలన్నారు.
మండల కేంద్రంలోని కాలేజీల వద్ద కూడా సి.సి కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. గ్రామాల్లో దొంగతనాలను నిలువరించేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు. గ్రామాల్లో యుజవన సంఘాలను చైతన్యపర్చి గస్తీ బృందాలుగా ఏర్పడేలా చూడాలన్నారు. మట్కా, పేకాట జూదం, గుట్కా విక్రయాలు జరుగకుండా గట్టి నిఘా కొనసాగించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారి పట్ల మర్యాదపూర్వకంగా మసలుకోవాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. పోలీసు సిబ్బంది ఏవైనా తప్పులు చేస్తే ప్రజలు తమకు నేరుగా ఫిర్యాదు చేయాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డిఎస్పీ రాంరెడ్డి, సిఐ రమణారెడ్డి, ఎస్‌ఐలు విజయ్‌కుమార్, సుఖేందర్‌రెడ్డితో పాటు మోర్తాడ్, సిరికొండ ఎస్‌ఐలు పాల్గొన్నారు.



No comments:
Post a Comment