గ్రేటర్ పరిధిలో సుడిగాలి పర్యాటనలు
మేయర్‌పీఠం కేవసానికి ఎన్నోవ్యూహలు
ఒకవైపుశంకుస్థాపనలు, మరోవైపు సామాజిక వర్గాల నేతలతో సమావేశాలు
హైదరాబాద్, సూర్య ప్రత్యేక ప్రతినిధి: త్వరలో జరుగనున్న బల్దియా ఎన్నికల్లో టిఆర్ఎస్ రథసారధి కె. తారకరామారావు దూసుకుపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవటం ద్వారా తన సామర్ధ్యాన్ని యావత్ రాష్ట్రానికి చాటి చెప్పాలని కెటిఆర్ కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. అందుకనే ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడక పోయినా కెటిఆర్ తెలంగాణా రాష్ట్ర సమితి తరపున ప్రచారం మొదలు పెట్టేసారు. ప్రతీ రోజూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండు మూడు డివిజన్లలో పర్యటిస్తూనే ఉన్నారు. రహదారుల అభివృద్ధి, మంచినీటి పైప్‌లైన్ల నిర్మా ణం, పార్కులు, డబుల్ బెడ్‌రూంల నిర్మాణం, ఫ్లై ఓవర్లని ప్రతిరోజూ ఏదో ఒక శంకుస్ధాపన కార్య క్రమం పెట్టుకుంటున్నారు.
ఆయా డివిజన్ల పరిధిలో పర్యటించేటపుడు తన వెంట నగరానికే చెందిన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీని వాసయాదవ్, పద్మారావుల్లో ఎవరో ఒకరు ఉండేట్లు చూసుకుంటున్నారు. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ వెలువడితే అభివృద్ది కార్యక్రమాల ప్రకటనకు, శంకుస్ధాపనకు అవకాశాలుండవన్న ఉద్దేశ్యంతో జిహెచ్ఎంసి పరిధిలో కెటిఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. దానికి తోడు బల్దియా ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడు, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు కెటిఆర్‌పైన మోపటం తో ఆయన కూడా దాన్ని సవాలుగానే తీసుకున్నారు. అందుకనే ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది నేతలను టిఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. దాంతో పార్టీ జిహెచ్ఎంసి పరిధిలో కూడా బలంగా కనబడుతోంది. జిహెచ్ఎంసిలో గెలుపే లక్ష్యంగా కెటిఆర్ కూడా అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. సీమాంధ్రులను కలుసుకోవటం, వారిలో ఆసక్తి ఉన్న వారికి టిక్కెట్లు కేటాయించి పోటిలోకి దింపటం, సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించటం లాంటి చర్యలకు కెటిఆర్ ఇప్పటికే శ్రీకారం చుట్టారు.
సీమాంధ్రులు ఎక్కువగా ఉండే డివిజన్లను గుర్తించటం ఇప్పటికే పూర్తి చేసారు. కొంపల్లి, నిజాంపేట, కూకట్‌పల్లి, షాద్‌నగర్, షామీర్‌పేట, నల్లకుంట, బర్కత్‌పుర, విద్యానగర్, అమీర్‌పేట, చందానగర్, మలక్‌పేట, దిల్‌షుక్‌నగర్, కొత్తపేట, సికింద్రాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ నాయకత్వం గుర్తించింది. అందులో కూడా బ్రాహ్మణ, క్షత్రియ సామాజిక వర్గం మీద కన్నేసిన టిఆర్ఎస్ ఆ సమాజిక వర్గానికి చెందిన నేతలతో ఇప్పటికే పలు దఫాలు సమావేశాలు కూడా నిర్వహించింది. జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో సుమారు 15 డివిజన్లలో సీమాంధ్రులకు టిక్కెట్లు కేటాయించేందుకు అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పై సమాజిక వర్గాలకు చెందిన నేతలతో కెటిఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కుకట్‌పల్లి ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు తదితరులు సమావేశాలు కూడా నిర్వహించారు. టిఆర్ఎస్‌కు మద్దతు పలకటం వల్ల ఒనగూరే ఉపయోగాలను వీరు వివరించి చెబుతున్నారు. ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతల నుండి మద్దతు విషయంలో హామీలు కూడా అందుకుంటున్నారు.
ఈ విషయాలను గమనించిన కారణంగానే కాంగ్రెస్ కూడా హటాత్తుగా బల్దియా ఎన్నికల్లో సీమాంధ్రులకు కోటా అన్న కొత్త పల్లవిని అందుకున్నది. పిసిసి నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సీమాంధ్రులకు కోటా కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. సీమాంధ్రుల ఓట్లను ఆకర్షించటంలో భాగంగా వరాలు గూడా గుప్పించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. మొత్తం మీద జిహెచ్ఎంసి ఎన్నికల పోరు టిఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే జరిగే అవకాశాలే ఎక్కువున్నాయి. అయితే, ఒక వైపు టిడిపి-భారతీయ జనతాపార్టీ, మరోవైపు మజ్లిస్ కూడా ఎన్నికల కదన రంగంలోకి దూకుటానికి సిద్ధంగా ఉన్నాయి. ఎవరికి వారే గ్రేటర్ పీఠం తమదేనని చెప్పుకుంటున్నప్పటికీ బల్దియాలో పాగా వేయటానికి ఇప్పటికైతే అవకాశాలు అధికార తెలంగాణా రాష్ట్ర సమితికే ఎక్కువున్నాయి. అన్నీ విషయాలనూ భేరీజు వేసుకున్న తర్వాత మాత్రమే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేయబోతున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. అందులోనూ 100 డివిజన్లను సాధించటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రాగానే జిహెచ్ఎంసి వేడి రాజుకోవటం ఖాయంగా కనబడుతోంది.


No comments:
Post a Comment