నాడు భార్యకు నేడు పెద్ద కొడుక్కి
పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగానే కాక రైల్వే శాఖ మంత్రిగానూ తనదైన శైలిలో సత్తా చాటారు. నష్టాల్లో ఉన్న భారతీయ రైల్వేలను లాభాల బాట పట్టించిన ఘనత ఆయనదే. అయితే, దాణా కుంభకోణంలో గడ్డి మేసిన లాలూ ఆ తరువాత రాజకీయాలకు అనర్హుడిగా మారిపోయా రు. ఫలితంగా అప్పటి వరకు గృహిణిగా కాలు బయటపెట్టని ఆయన సతీమణి ర్రబీ దేవి రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. భర్త జైలులో ఉంటే, ఆమె బీహార్ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు. జైలులో ఉన్నా, భార్య బాధ్యతలన్నీ లాలూనే నడిపారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీతో చేతులు కలిపిన లాలూ ఘన విజయం సాధించా రు. తనకు ఎటూ అవకాశం లేకపోవడంతో ఇద్దరు కుమారులను రాజకీయ తెరంగేట్రం చేయించారు. ఇద్దరినీ గెలిపించుకున్నారు.
వారిలో చిన్నోడు తేజస్వీ యాదవ్‌ను డిప్యూటీ సీఎం పీఠంపై కూర్చోబెట్టి, పెద్దోడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇప్పించుకున్నారు. చిన్నోడి కంటే పెద్దోడు కాస్తంత డల్ అని లాలూనే చెప్పారు. మరి పాలనా వ్యవహారాల్లో పెద్దోడు ఎలా రాణిస్తారనుకున్నారో, ఏమో కాని... లాలూ తన కొడుక్కు షాడో మంత్రిగా మారిపోయారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని ఇందిరా గాంధీ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆదివారం ఆయన తనిఖీలు నిర్వహించారు. ఓ రోగిని పరామర్శించేందుకే తాను ఆసుపత్రికి వెళ్లానని లాలూ చెప్పినా, ఆయన వ్యవహార సరళిని క్షణాల్లో గ్రహించిన వైద్యులు ఆయన అడిగిన సమాచారమంతా చెప్పేసి బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.



No comments:
Post a Comment