-డీఆర్డీవో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ అభినందనలు
బాలాసోర్, జనవరి 31: రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయిని చేరింది. టన్నుకు పైగా బరువు గల అణ్వస్ర్తాలను ఒకేసారి మోసుకెళ్లగల, 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగల అగ్ని-5 క్షిపణిని భారత శాస్త్రవేత్తలు శనివారం విజయవంతంగా పరీక్షించా రు. ఒడిశా తీరంలోని వీలర్స్ ఐలాండ్‌లో గల లాంచ్ కాంప్లెక్స్-4 నుంచి శనివారం ఉదయం దీనిని పరీక్షించినట్లు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ తెలిపారు. అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని-5 క్షిప ణి పరీక్ష అతితక్కువ సమయంలోనే నిర్వహించిన ట్లు పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో భారత రక్షణ రంగానికి మరింత బలం చేకూరినట్లయిందని విశ్లేషకులు చెప్తున్నారు. మరికొన్ని ప్రయోగాల అనంతరం అగ్ని-5ని భద్రతా దళాలకు అప్పగించనున్నారు. ఇంతకుముందు అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4 క్షిపణులు భారత అమ్ములపొదిలో ఉన్నాయి. అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి అణ్వస్ర్తాలను మోసుకెళ్లగల అగ్ని-5 క్షిపణిని మూడోసారి విజయవంతంగా పరీక్షించినందుకు అభినందనలు అని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్‌కు పంపించిన సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. భారత సైన్యానికి అగ్ని-5 క్షిపణి ఒక బహుమతి కానున్నదని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రతి క్షణాన్ని ఆస్వాదించా:డీఆర్‌డీవో చీఫ్ అవినాష్ చందర్
డీఆర్‌డీఏలో పనిచేసిన ప్రతిక్షణాన్ని ఆస్వాదించానని సంస్థ చీఫ్ అవినాష్ చందర్ పేర్కొన్నారు. ఖండాంతర లక్ష్యాలను చేధించగల దీర్ఘశ్రేణి క్షిపణి అగ్ని రూపశిల్పిగా పేరొందిన అవినాష్‌చందర్ ఇప్పటివరకు తన కు సహకరించిన సంస్థ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. డీఆర్‌డీవో సంస్థ చీఫ్‌గా అవినాష్ చందర్ కాంట్రాక్ట్‌ను రక్షణశాఖ మంత్రి పారికర్ ఈ నెల 13న రద్దుచేసిన సంగతి తెలిసిందే. తన పదవీకాలం ముగిసిన సందర్భంగా శనివారం ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు అధునాతన క్షిపణులు రూపొందించినందుకు ఎంతో సంతోషంతో సర్వీస్ నుంచి వైదొలుగుతున్నానని చెప్పారు. డీఆర్‌డీవో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శనివారం విజయవంతంగా అగ్ని క్షిపణిని ప్రయోగించినందుకు రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ డీఆర్‌డీవో సిబ్బందిని అభినందించారు.


No comments:
Post a Comment