న్యూఢిల్లీ, జనవరి 30: జాతిపిత మహాత్మా గాంధీ 67వ వర్థంతి సందర్భంగా దేశం ఆయనను ఘనంగా స్మరించుకుంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం న్యూఢిల్లీలో రాజ్‌ఘాట్‌ను సందర్శించి దేశ ప్రజల తరఫున గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. వారితో పాటు ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు కూడా గాంధీజీ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారంతా రాజ్‌ఘాట్ వద్ద రెండు నిమిషాలు వౌనం పాటించి గాంధీజీకి అంజలి ఘటించారు. అనంతరం అక్కడ సర్వమత ప్రార్థన నిర్వహించారు. అలాగే రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్‌లతో పాటు త్రివిధ దళాధిపతులు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆరుప్ రహా, అడ్మిరల్ రాబిన్ ధోవన్, జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా గాంధీజీ సమాధికి నివాళులర్పించి గన్ శాల్యూట్ సమర్పించారు. పూజ్య బాబూజీకి ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ ‘ట్విట్టర్’లో పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు కూడా మోదీ ఘనంగా నివాళులర్పించారు. అమర జవాన్ల త్యాగాలు, వారి ధైర్య సాహసాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.


No comments:
Post a Comment