పోలీసులను ఆశ్రయించిన రాజమౌళి.. ఫేస్‌బుక్, వాట్స్‌పలలో 13 నిమిషాల నిడివిగల దృశ్యాలు
ఎడిటింగ్, గ్రాఫిక్స్ సిబ్బందిపై అనుమానం.. ప్రశ్నిస్తున్న పోలీసులు.. వీడిన చిక్కుముడి?
పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు?.. 2,3 రోజుల్లో నిందితుల వివరాలు ప్రకటించే అవకాశం
ఎడిటింగ్, గ్రాఫిక్స్ సిబ్బందిపై అనుమానం.. ప్రశ్నిస్తున్న పోలీసులు.. వీడిన చిక్కుముడి?
పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు?.. 2,3 రోజుల్లో నిందితుల వివరాలు ప్రకటించే అవకాశం
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ: సినిమాలను పట్టిపీడిస్తున్న పైరసీ భూతం మరింతగా జడలు విప్పుకొంది! ఒకప్పుడు సినిమా విడుదలైన 2, 3 రోజుల్లో కెమెరా ప్రింట్లు బయటకి వస్తే.. ఇప్పుడు సినిమా విడుదల కాకముందే ప్రతిష్ఠాత్మక చిత్రాల్లోని దృశ్యాలు లీకయిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల క్రితం ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి ఈ పరిస్థితి ఎదురుకాగా.. తాజాగా హిట్ చిత్రాల దర్శకుడు రాజమౌళి చేపట్టిన భారీ చిత్రం ‘బాహుబలి’కీ అదే పరిస్థితి ఎదురైంది. ఆ సినిమా ప్రథమార్థంలో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న 13 నిమిషాల వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అయిపోవడంతో చిత్ర యూనిట్ నివ్వెరపోయింది. తొలుత ఈ సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయని తెలియగానే బాహుబలి టెక్నికల్ టీం రంగంలోకి దిగి నిమిషాల వ్యవధిలో ఆ వీడియోలను తొలగించి వేసింది.
కానీ, ఆ కాస్త వ్యవధిలోనే వాటిని కొందరు డౌన్‌లోడ్ చేసుకోవడంతో ప్రస్తుతం ఆ వీడియో ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా వ్యాప్తిలోకి వెళ్లిపోయింది. దీనిపై దర్శకుడు రాజమౌళి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు అందినప్పటికీ పోలీసులు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. ‘బాహుబలి’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావస్తోంది. దీనికి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ నడుస్తోంది. ఎడిటింగ్ యూనిట్ సిబ్బందే ఈ సన్నివేశాలను బయటకు తీసుకెళ్లారని అనుమానం వ్యక్తమవుతోంది. అలాగే ఈ చిత్రంలో గ్రాఫిక్సూ భారీగానే ఉన్నాయి. ఈ పనిని నగరంలో ప్రముఖ గ్రాఫిక్స్ కంపెనీకి అప్పగించారు. ఇక్కడి నుంచీ సన్నివేశాలు లీకయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న మొత్తం పది మందిని రహస్యంగా విచారిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైం పోలీసులు కేసు చిక్కుముడిని దాదాపు విప్పేశారని తెలిసింది. గ్రాఫిక్స్ వర్క్‌ను దక్కించుకున్న కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగి ‘లీకేజీ’కి సూత్రధారి అని తేలినట్టు సమాచారం.
అయితే, పోలీసులు దీన్ని ధ్రువీకరించట్లేదు. అతడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ‘బాహుబలి’ లీక్‌పై దర్శకుడు రాజమౌళి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. లీకైన సన్నివేశాలన్నీ చిత్రం మొదటిభాగంలో కీలమైనవి కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రాజమౌళి ఈ చిత్రంలోని ఒక్క సన్నివేశమూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో చిత్రాన్ని రీళ్ల రూపంలో థియేటర్లకు పంపేవారు. కానీ, ప్రస్తుతం చిప్‌లలో రికార్డ్ చేస్తున్నందున ఆ చిప్‌లు బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బయటివారు షూటింగ్ జరిగే చోటుకు రాకుండా యూనిట్ సిబ్బందికి ఐడెంటిటీ కార్డులు జారీ చేశారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం లేకపోయింది. కాగా.. రెండు రోజుల్లో పోలీసులు అధికారికంగా నిందితుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.


No comments:
Post a Comment