సైనా పేరును పద్మ భూషణ్‌కు సిఫారసు చేయని క్రీడాశాఖ
ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాదీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు అందుకోవాలని కలలుగన్న బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. 2013లో దక్కని ఈ అవార్డును ఈ సారైనా అందుకోవాలన్న హైదరాబాదీ ఏస్ షట్లర్‌కు మరో ఏడాదిదాకా వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబంధనల సాకుతో గతంలో ఆమె దరఖాస్తును తిరస్కరించిన క్రీడా మంత్రిత్వ శాఖ ఈ సారి ‘ప్రత్యేక కేసు’గా రెజ్లర్ సుశీల్ కుమార్‌ను పేరును తెరపైకి తీసుకొచ్చి సైనా పేరును పక్కనబెట్టింది. పద్మ భూషణ్ అవార్డు కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) సైనా పేరును ఆగస్టులోనే క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసినా.. క్రీడా శాఖ మాత్రం హోం మంత్రిత్వ శాఖకు ఆమె పేరును పంపలేదు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ పేరును ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ప్రతిపాదించింది. సుశీల్‌కు కూడా నిబంధనలు అడ్డొస్తున్నా ప్రత్యేకంగా పరిగణించింది. కాగా క్రీడాశాఖ తీరు పట్ల సైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2013లో దరఖాస్తు చేసుకుంటే పద్మశ్రీ తీసుకుని ఐదేళ్లు కాలేదు కాబట్టి 2014లో ప్రయత్నించమన్నారని, కానీ ఇప్పుడేమో తన పేరును హోం శాఖకు పంపలేదని ఆవేదన వ్యక్తం చేసింది.ఐదేళ్లు పూర్తయ్యాయిగా..: సైనాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2013లో ఆమె ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డుకి దరఖాస్తు చేసుకుంది. కానీ, ఒకసారి పద్మ అవార్డు తీసుకున్నాక మరో ‘పద్మ’ అవార్డు అందుకోవాలంటే ఐదేళ్లు ఆగాలన్న నిబంధనను సాకుగా చూపిస్తూ క్రీడా శాఖ ఆమె దరఖాస్తును అప్పట్లో తిరస్కరించింది. తర్వాతి ఏడాది ప్రయత్నించమని పేర్కొంది. అయితే ఇప్పుడేమో ఆమె దరఖాస్తును పక్కనబెట్టి సుశీల్ కుమార్ పేరును ‘ప్రత్యేక కేసు’గా తెరపైకి తెచ్చింది. ఈ పరిణామంపై సైనా స్పందిస్తూ.. ‘పద్మ భూషణ్ అవార్డు కోసం సుశీల్ కుమార్ పేరును ప్రత్యేకంగా పరిగణించి హోం శాఖకు పంపినట్టు తెలిసింది. రెండు పద్మ అవార్డుల మధ్య కనీసం ఐదేళ్లు విరామం ఉండాలని హోం శాఖ మార్గదర్శకాలు చెబుతున్నాయి. నేను పద్మశ్రీ తీసుకుని ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు సుశీల్ కుమార్ పేరును క్రీడాశాఖ.. హోంశాఖకు ప్రతిపాదిస్తున్నపుడు నా పేరును కూడా సిఫారసు చేయొచ్చు కదా. కానీ, అలా చేయలేదు. ఇది చాలా బాధ కలిగించింద’ని ఆమె వాపోయింది. కాగా, 2011లో పద్మశ్రీ అందుకున్న సుశీల్ కుమార్ పేరును మాత్రం ఐదేళ్లు పూర్తి కాకపోయినా సిఫారసు చేయడాన్ని సైనా తప్పుబట్టింది.
సుశీల్ గొప్ప ఆటగాడే కానీ..: దేశానికి ఎన్నో విజయాలు అందించినప్పటికీ క్రీడా శాఖ తనను చిన్నచూపు చూసిందని సైనా ఆవేదన వ్యక్తం చేసింది. ‘పద్మ భూషణ్ అవార్డు కోసం గతేడాది కూడా దరఖాస్తు చేసుకున్నా. అప్పుడు క్రీడాశాఖ ‘సైనా.. నువ్వు పద్మశ్రీ అందుకుని ఐదేళ్లు కాలేదు. కాబట్టి వచ్చే ఏడాది దరఖాస్తు చేసుకో’ అని చెప్పింది. కాబట్టి మళ్లీ 2014లో దరఖాస్తు చేసుకున్నాను. అయినా నా పేరును హోంశాఖకు ఎందుకు సిఫారసు చేయలేదు? 2010 తర్వాత నేను కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించా. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించా. కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించా. ఎన్నో సూపర్ సిరీస్ టైటిళ్లు నెగ్గా. కాబట్టి ఈ అవార్డుకి నేను పూర్తిగా అర్హురాలినేనని భావిస్తున్నాన’ని సైనా తెలిపింది. ‘సుశీల్ గొప్ప ఆటగాడే. కానీ, పతకం పతకమే. ఇద్దరం ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాం. ఒకవేళ ప్రత్యేకంగా పరిగణించి అవార్డు ఇవ్వదలచుకుంటే 2012లోనే అతనికి ఇవ్వాల్సింది. ఇప్పుడెందుకు ఇస్తున్నారు. ఈ నిర్ణయం నన్ను చాలా బాధించింది. నేను ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నా. ఈ అవార్డు మా ఇద్దరికీ ఇస్తే బాగుంటుంది. ఒక వేళ పద్మశ్రీ అందుకని ఐదేళ్లు పూర్తికాని సుశీల్ పేరును ప్రత్యేకంగా పరిగణిస్తే.. నా పేరు కూడా సిఫారసు చేయాలి. ఎందుకంటే నేను పద్మశ్రీ అందుకుని ఐదేళ్లు దాటిపోయింద’ని ఆమె వెల్లడించింది.


No comments:
Post a Comment