మహమ్మదు ప్రవక్తను అవమానించే రీతిలో కార్టూన్లను ప్రచురించడాన్ని దాదాపు సగం మంది ఫ్రెంచ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు ఆదివారం ప్రకటించిన ఓ సర్వే వెల్లడించింది. ఫ్రెంచ్ మ్యాగజైన్ చార్లీ హెబ్డో సిబ్బంది హత్యల తర్వాత భావప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఈ పోల్ సర్వేను ప్రకటించడం గమనార్హం. మహ్మదు ప్రవక్తను అవమానించడంగా పలువురు ముస్లింలు భావించే అలాంటి కార్టూన్లను ప్రచురించకూడదని ‘ఐఫాప్’ నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాగా, ఆన్‌లైన్‌లో సామాజిక మీడియా నెట్‌వర్క్‌లలో భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉండడాన్ని తాము సమర్థిస్తామని మరో 50 శాతం మంది చెప్పారు. అయితే ముస్లింలు వ్యతిరేకిస్తున్నారన్న కారణంగా కార్టూన్ల ప్రచురణను ఆపకూడదని 57 శాతం మంది అభిప్రాయ పడినట్లు ‘లీ జర్నల్ డు డుమాంచే’ పత్రికలో ప్రచురించిన ఆ సర్వే పేర్కొంది. కాగా, ఫ్రెంచ్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ద్వంద్వ పౌరసత్వం కలిగిన వారికి ఫ్రెంచ్ పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనకు దాదాపు 81 శాతం మంది ముక్తకంఠంతో మద్దతు తెలపడం గమనార్హం.


No comments:
Post a Comment