శ్రీరంగం, మార్చి 22: ఎనిమిదో శతాబ్దం నాటి శ్రీరంగనాథ స్వామి ఆలయం పునరుద్ధరణ పనులు జరుగుతున్న సమయంలో ఓ భారీ నేలమాళిక బయట పడింది. ఇది దాదాపు 200 చదరపు అడుగుల మేర ఉన్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. నాలుగు అడుగుల వెడల్పు,20 అడుగుల పొడవు ఉన్న నేల మాళిగ శ్రీ ధన్వంతరి (మహావిష్ణువు) భారీ చిత్రపటం వెనుక కనిపించిందని ఎగ్జిక్యూటివ్ అధికారి జయరామన్ తెలిపారు. మరమ్మతు పనులు జరుగుతూండగా ఈ భారీ చిత్ర పటం కింద పడిందని, దాని వెనుక ఉన్న గ్రానైట్ శ్లాబ్‌ను తొలగించడంతో నేలమాళిగ బయట పడిందని తెలిపారు. అయితే దీని లోపల ఎలాంటి విలువైన వస్తువులు కనిపించలేదన్నారు. అప్పట్లో భారత్‌పై జరిగిన దాడుల సమయంలో ఆలయంలోని విలువైన వస్తువులను పరిరక్షించుకోవడానికే ఈ నేలమాళిగను తవ్వి ఉంటారని, తమిళనాడులోని దాదాపు అన్ని ఆలయాల్లోనూ నేలమాళిగలు కనిపిస్తాయని చెప్పారు. వేణుగోపాల స్వామి ఉప ఆలయంలో ఈ నేలమాళిగ బయట పడిందన్నారు. ఈ ఆలయంలో కూడా ఎన్నో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయని, ఎనిమిదో శతాబ్దంలో హోయశాల పాలకుల హయాంలో దీన్ని నిర్మించారని తెలిపారు


No comments:
Post a Comment