న్యూఢిల్లీ, మార్చి 11: బొగ్గు కుంభకోణం ఇంకా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను వెంటాడుతోంది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ఒక ప్రముఖ ఫ్రైవేటు కంపెనీకి అవకాశం కల్పించడం కోసం పన్నిన కుట్రలో మన్మోహన్ సింగ్‌ను కూడా భాగస్వామిని చేసారని పేర్కొంటూ సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం ఆయనకు ఒక నిందితుడిగా సమన్లు జారీ చేసింది. భారత దేశ చరిత్రలో ఒక క్రిమినల్ కేసులో మాజీ ప్రధానికి సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. గతంలో జెఎంఎం ఎంపీల ముడుపుల కేసుతో సహా మూడు కేసులకు సంబంధించి మాజీ ప్రధాని నరసింహారావుపై చార్జిషీట్ దాఖలు కావడం, చివరికి ఆయన నిర్దోషిగా విడుదల కావడం తెలిసిందే. కాగా, 2005లో తాను బొగ్గు శాఖను కూడా నిర్వహించినప్పటికి సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి న్యాయ పరీక్షను ఎదుర్కోవడానికైనా సిద్ధమేనని 83 ఏళ్ల మన్మోహన్ అన్నారు.
2005లో ఒడిశాలోని తాల్‌బిరా-2 బొగ్గు క్షేత్రాన్ని హిండాల్కో కంపెనీకి కేటాయించడానికి సంబంధించిన ఈ కేసులో ఆ సంస్థతో పాటుగా సంస్థ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు శుభేందు అమితాబ్, డి భట్టాచార్య, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్‌లలను నిందితులుగా పేర్కొంటూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 8న కోర్టు ఎదుట హాజరు కావలసిందిగా మన్మోహన్‌ను, మిగతా అయిదుగురు నిందితులను సిబిఐ ప్రత్యేక జడ్జి భరత్ పరాశర్ ఆదేశించారు.
మొదట బిర్లా, ఇతర నిందితులపై కేసును మూసివేయడానికి సిబిఐ కోర్టు అనుమతిని కోరింది. అయితే సిబిఐ సమర్పించిన క్లోజర్ రిపోర్టును తిరస్కరించిన కోర్టు దర్యాప్తు అధికారులను మన్మోహన్‌తో పాటు ఇతర నిందితులను విచారించాల్సిందిగా ఆదేశించింది.


No comments:
Post a Comment