విక్టోరియా, మార్చి 11: ప్రపంచానికి ఉగ్రవాదం ఎలా తీవ్రమైన ముప్పో, సిషెల్స్ లాంటి దీవుల దేశాలకు పర్యావరణ మార్పులు కూడా అంతే ముప్పని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భూతాపాన్ని ఎదుర్కోవడానికి భారత దేశం పూర్తిగా కట్టుబడి ఉందని కూడా ఆయన చెప్పారు. ‘మనం ఉగ్రవాదం గురించి ఎలా చర్చిస్తున్నామో పర్యావరణ మార్పు గురించి చర్చించడానికి ప్రపంచ దేశాలన్నీ ఒక్కటి కావాలి’ అని బుధవారం ఇక్కడి పలైస్ డెస్ స్పోర్ట్స్‌లో తనకు జరిగిన పౌర సన్మానం సందర్భంగా మోదీ అన్నారు. అణు బాంబును ఎవరు తయారు చేస్తున్నారనే లాంటి విషయాలు దీవుల దేశాల ప్రజలకు పట్టదని, అయితే భూతాపం గురించి మాత్రం వాళ్లు ఆందోళన చెందుతారని, ఎందుకంటే అది వారి మనుగడతో ముడిపడిందని ప్రధాని అన్నారు. ‘ఈ రోజు దీవుల్లో ఉండే చిన్న చిన్న దేశాలు అణుబాంబును ఎవరు తయారు చేస్తున్నారనే దాని గురించి చర్చించుకోవు కానీ భూతాపం గురించి మాత్రం ఆలోచిస్తాయి. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే తాము బతికి ఉంటామో లేదో, తమ దీవి నీటిలో మునిగి పోతుందేమోనని వారి భయం. ప్రపంచాన్ని రక్షించడానికి దీవుల్లో నివసించే వారే కాకుండా మొత్తం ప్రపంచ దేశాలు దీని గురించి చర్చించడమే కాకుండా దీన్ని ఎదుర్కోవడానికి కృషి చేయాలి. ఉగ్రవాదం గురించి ప్రపంచం ఏ స్థాయిలో చర్చిస్తూ ఉందో పర్యావరణ మార్పు గురించి కూడా అదే స్థాయిలో చర్చించాలి’ అని మోదీ అన్నారు. కాగా, పర్యావరణ మార్పును ఎదుర్కోవడానికి భారత దేశం పూర్తిగా కట్టుబడి ఉందని అంతకు ముందు ప్రధాని చెప్పారు. ‘పర్యావరణ మార్పుపై మా రెండు దేశాల అభిప్రాయాలు ఒకటే. దాని ప్రభావానికి గురవుతున్న దేశాలు మావి’ అని సిషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ అలిక్స్ మైఖేల్‌తో చర్చల అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ మోదీ అన్నారు. గత 34 ఏళ్లలో ఒక భారత ప్రధాని సిషెల్స్‌లో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి.
నాలుగు ఒప్పందాలపై సంతకాలు
కాగా ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మనదేశం సిషెల్స్‌తో నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది. చమురు, సహజ వాయు నిల్వలను గుర్తించడంలో, సంప్రదాయేతర ఇంధనం, వౌలిక సదుపాయాల అభివృద్ధి ఇతర దేశాలకు విక్రయించడం కోసం సంయుక్తంగా నేవిగేషన్ చార్టులు, ఎలక్ట్రానిక్ నేవిగేషన్ చార్టులు రూపొందించడం ఈ ఒప్పందాల్లో ఉన్నాయి. కాగా, ఆ దేశంలో భద్రతా సహకారాన్ని పెంపొందించుకోవడంలో భాగంగా తీర ప్రాంత గస్తీ రాడార్ ప్రాజెక్టును సైతం ప్రధాని ప్రారంభించారు. సిషెల్స్ రాజధాని మాహే దీవిలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ తీర ప్రాంత గస్తీరాడార్ వ్యవస్థ రెండు దేశాల మధ్య సహకారానికి మరో గుర్తుగా భావించవచ్చు. అంతేకాకుండా సిషెల్స్‌కు రెండవ డార్నియర్ విమానాన్ని ఇవ్వడానికి, ఆ దేశ పౌరులకు మూడు నెలల కాలానికి ఉచిత వీసాలను అందించడానికి కూడా మన దేశం అంగీకరించింది.


No comments:
Post a Comment