ఇస్లామాబాద్, మార్చి 10: హత్య కేసులో ఇంతవరకూ కోర్టుకు హాజరుకాకపోవడాన్ని తప్పుపడుతూ పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఇక్కడి కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. తరచూ మినహాయింపులు కోరుతూ ఇంతవరకు కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో ఆగ్రహించిన అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి వాజిద్ అలీఖాన్ బెయిల్‌తో కూడిన అరెస్టు వారెంట్‌కు ఆదేశించారు. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి, ఆ రోజున కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. లాల్ మసీదు మతపెద్ద ఘాజి అబ్దుల్ రషీద్ హత్య కేసులో ముషారఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ముషారఫ్‌పై 2013లో పోలీసులు కేసు నమోదు చేశారు. 2007లో ఉగ్రవాదుల ఏరివేత పేరుతో జరిగిన ఆర్మీ ఆపరేషన్‌లో ఇస్లామాబాద్‌లోని లాల్ మసీదు మతపెద్ద రషీద్‌ను హతమార్చారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఇంతవరకు హాజరుకాని ముషారఫ్, అనారోగ్యం, భద్రత పేరుతో మినహాయింపు కోరుతూ వచ్చారు. అయితే, ఏప్రిల్ 2న జరగబోయే తదుపరి విచారణకు ముషారఫ్ కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. 1999 నుంచి 2008 మధ్య పాక్‌ను పాలించిన 72 ఏళ్ళ సైనిక పాలకుడు ముషారఫ్ వరుస కేసులను ఎదుర్కొంటున్న విషయం విదితమే


No comments:
Post a Comment