కేబుల్ వ్యాపారాన్ని భయపెడుతున్న 70 వేల కోట్ల రిలయెన్స్ 'జియో'
రిలయెన్స్ జియో పేరుతో 70 వేల కోట్ల పెట్టుబడులతో ప్రారంభమవుతున్న 4G సేవలు కేబుల్, డిటిహెచ్ వ్యాపారాన్ని సమూలంగా తుడిచిపెట్టే ప్రమాదముందని తేలడంతో కేబుల్ పరిశ్రమలో భయాందోళనలు మొదలయ్యాయి. బ్రాడ్ బాండ్ వ్యాపారానికి కూడా పెనుప్రమాదం ముంచుకొస్తోంది. అతి తక్కువ ధరలో వినియోగదారులకు అత్యధిక సేవలందించటం ధ్యేయమంటున్న రిలయెన్స్ ఒక విప్లవం తీసుకురాబోతున్నదన్నది మాత్రం నిజం.
ఇంతకీ రిలయెన్స్ జియో అందించేదేమిటి ? కేవలం ఒక డేటా కార్డ్ లాంటి పరికరం సాయంతో టీవీ చానల్స్ ప్రసారాలు అందుతాయి. కేబుల్ అవసరమే ఉండదు. ఇది వైర్ లెస్. డిటిహెచ్ తరహాలో డిష్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కోరుకున్న చానల్స్ కు మాత్రమే డబ్బు చెల్లించవచ్చు. నెలనెలా రీచార్జ్ చేసుకోవటమే. డిజిటల్ నాణ్యత. కారులో టీవీ ఉన్నా ప్రసారాలు అందుతాయి. ఇక మీదట బస్సుల్లో ఉండే టీవీ సెట్లలోనూ రిలయెన్స్ జియో సాయంతో చానల్స్ ప్రసారాలు చూడవచ్చు. టీవీ కార్యక్రమాలు రికార్డ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది.
ఇది ఇంతవరకే పరిమితం కాదు. రిలయెన్స్ జియో అందించే డేటా కార్డ్/డాంగిల్ తీసుకొని మనకు కావాల్సిన ఇతర సౌకర్యాలు కూడా కలుపుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా తీసుకోవచ్చు. వై ఫై కనెక్టివిటీ కూడా పెన్ డ్రైవ్ పరిమాణంలో ఉండే అదే పరికరం అందిస్తుంది. టెలిఫోన్ కి కూడా ఇదే ఉపయోగపడుతుంది. అంటే సుమారు ఐదు వందల రూపాయాల్లో టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం ఇంటింటికీ అందించగలిగే బృహత్తర పథకం ఇది. దీని ప్రభావాన్ని ఇప్పటికిప్పుడు అంచనావేయటం కూడా కష్టమంటున్నారు మార్కెట్ నిపుణులు.
కొంతకాలంగా రిలయెన్స్ ఈ పథకాన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ, బిజెపి అధికారంలోకి రాగానే కార్యాచరణ వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ వాడుకుంటూ ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో వై ఫై ని యాక్టివేట్ చేసింది. జియో కోసం పది వేలమంది పూర్తికాలపు ఉద్యోగులు పనిచేస్తుందగా మరో 30 వేలమంది నిపుణులు సేవలందిస్తున్నారు. పైగా ఈ నెట్ వర్క్ కోసం డిజిటల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సమకూర్చటానికి లక్షమంది పనిచేస్తున్నారు. భారత్ లో అతిపెద్ద వ్యాపారాల్లో ఇది ఒకటి అవుతుందని అంబానీ అంటున్నారు.
ఈ ఆగస్టులో క్షేత్ర స్థాయిలో ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తూ, వచ్చే జనవరి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. మొదటి విడతలోనే 90 శాతం ప్రజలకు అందేలా 5,000 పట్టణాల్లోనూ, 2,15,000 గ్రామాల్లోనూ జియో 4G సేవలు విస్తరిస్తారు. ఆ తరువాత మొత్తం ఆరులక్షల గ్రామాల్లో మిగిలిపోయినవాటికి అందిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, భవిష్యత్తులో మరే ఇతర సాంకేతిక పరిజ్ఞానమూ దీనికి సాటిరాకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని ముఖేష్ అంబానీ చెబుతున్నారు.
ఈ భారీ ప్రాజెక్టు వలన కేబుల్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇప్పటివరకు ఏర్పాటుచేసుకున్న మౌలిక వసతులన్నీ వృధా అవుతాయి. కేబుల్స్, కంట్రోల్ రూమ్స్, డిజిటల్ హెడ్ ఎండ్స్, సెట్ టాప్ బాక్స్ లు..ఇవన్నీ మూలనపడతాయి. ఈ నష్టాన్ని ఇప్పటికిప్పుడు అంచనావేయటం కష్టమే అయినా సగటున కనెక్షన్ కు రెండు వేల చొప్పున 15 కోట్ల కనెక్షన్లున్న కేబుల్ పరిశ్రమకు 30 వేలకోట్ల నష్టం ఉంటుంది. డిజిటైజేషన్ మీద వెచ్చించిన భారీ మొత్తాలతో కలుపుకుంటే ఇది 50 వేలకోట్ల పైమాటే. అదే సమయంలో డిటిహెచ్ సంస్థలకూ విపరీతమైన నష్టాలుంటాయి, ఇదంతా మౌలిక సదుపాయాలమీద పెట్టిన ఖర్చు మాత్రమే. ఈ పరిశ్రమలో ఉన్న లక్షలాది మంది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులు, స్వయం ఉపాధిగా మార్చుకున్నవారూ వీధినపడే ప్రమాదముంది.
రిలయెన్స్ జియో వలన ఒకవైపు కేబుల్, డిటిహెచ్, ఇంటర్నెట్ వ్యాపారాలకు పెనుముప్పు ఖాయమని అర్థమవుతున్నప్పటికీ వినియోగదారులకు కలిగే సౌకర్యం మాత్రం చాల ఎక్కువ. పైగా తక్కువ ధరలకే బహుళ సౌకర్యాలు అందటం మంచి పరిణామం. కానీ గుత్తాధిపత్యం కారణంగా ముందు ముందు వాటిల్లే ప్రమాదాన్ని పసిగట్టి ప్రభుత్వం తగిన ఆంక్షలు విధించకపోతే వినియోగదారులమీద క్రమంగా భారం పెరగవచ్చు. రిలయెన్స్ జియో 4G సేవల ప్రభావాన్ని గ్రహించటం వల్లనే ప్రభుత్వం డిజిటైజేషన్ విషయంలో వేగం తగ్గించిందన్న అనుమానాలు కూడా టీవీ పరిశ్రమలో మొదలయ్యాయి.
-శ్రీనాథ్ రెడ్డి



No comments:
Post a Comment